Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ మరో వారం పొడిగింపు.. విచారణకు సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశం
విచారణకు సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశం
Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ ఎస్ఐబీ చీఫ్, ప్రధాన నిందితుడు టి. ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని మరో వారం పాటు పొడిగించింది సుప్రీం కోర్టు. డిసెంబర్ 25 వరకు కస్టడీలో ఉంచి, 26న విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
గత వారం రోజుల పాటు సిట్ అధికారులు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేపట్టారు. అయితే ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని సాక్ష్యాలు, కీలక సమాచారం సేకరించడానికి ఈ పొడిగింపు అవసరమని కోర్టు పేర్కొంది.
ప్రభాకర్ రావు తన విచారణలో నిబంధనల ప్రకారమే పనిచేశానని, అధికారుల ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని వాదించారు. అయితే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సిట్ వర్గాలు తెలిపాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావును విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, ఆయన భద్రతను కాపాడాలని కూడా సూచించింది.
ఈ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు డిసెంబర్ 12న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ ముందు లొంగిపోయారు. ఇప్పుడు మరోసారి కస్టడీ పొడిగింపుతో దర్యాప్తు మరింత లోతుగా సాగనుంది.