Political Storm Over Maganti Gopinath’s Death: మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయ దుమారం! తల్లి ఆరోపణలతో కేటీఆర్‌పై కలకలం.. విచారణకు డిమాండ్!
విచారణకు డిమాండ్!
Political Storm Over Maganti Gopinath’s Death: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఆయన తల్లి చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో భారీ కలకలం రేపాయి. "నా కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారు. ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలి" అని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడనే విషయం ఇతరులు చెప్పిన తర్వాతే తెలిసిందని, తనను ఆస్పత్రికి వెళ్లనివ్వలేదని, కేటీఆర్‌ను కలవాలని అడిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. "కేటీఆర్ వచ్చి వెళ్లాకే మరణ వార్త ప్రకటించారు. నా కొడుకు చనిపోయేటప్పుడు అతనికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు.. మూడు రోజులు కొడుకు ముఖం చూడకుండా పరితపించాను" అని ఆమె బాధను పంచుకున్నారు.
ఈ ఆరోపణలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో పార్టీల మధ్య ఆయుధంగా మారాయి. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. "మాగంటి గోపీనాథ్ మరణం గుండెపోటు కాదు, ఆస్తి కోసం జరిగిన హత్య. కేటీఆర్ లాంటి వ్యక్తులు సొంత మిత్రులను కూడా వదలడం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో పూర్తి విచారణ జరిపించాలి" అని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. "ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లాభం పొందాలని నేను అనుకోవడం లేదు. కానీ మాగంటి తల్లి నేరుగా కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉండలేదు. బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో అధికారిక లేఖ రాస్తే విచారణకు సిద్ధం" అని ప్రకటించారు.
బీఆర్ఎస్ నుంచి మాత్రం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారిక స్పందన లేదు. కేటీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలు మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గోపీనాథ్ మరణంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విచారణ జరగలేదు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలు బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయి. రాజకీయ పార్టీల మధ్య ఈ వివాదం మరింత ఉధృతమవుతుందని భావిస్తున్నారు.