Minister Tummala: ఆయిల్‌పామ్ రైతులకు రక్షణ కల్పించాలి: మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల
Minister Tummala: దేశంలోని ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడాలని, ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలకు లేఖలు రాశారు. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గించడంపై తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లోని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని మంత్రి తెలిపారు.
కేంద్ర నిర్ణయంతో దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఆయిల్‌పామ్ వంటి దీర్ఘకాలిక పంట విషయంలో విధాన స్థిరత్వం అవసరమని ఆయన అన్నారు. ‘‘రైతుల సమస్య కేవలం ఒక రాష్ట్రానికే సంబంధించింది కాదు. దిగుమతి సుంకం పెంచి ఆయిల్‌పామ్ రైతులకు తగిన రక్షణ కల్పించాలి’’ అని తుమ్మల కోరారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్ద సంఖ్యలో ఆయిల్‌పామ్ రైతులు ఉన్నందున, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లేఖలు రాయాలని ఆయన అభ్యర్థించారు.
ఇదే రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లి ప్రాంతానికి సాగునీరందించేందుకు చేపట్టిన ప్యాకేజీలు (9, 10, 11, 12) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్యాకేజీలు 9, 10లో మిగిలిన పనులను అక్టోబరు చివరినాటికి పూర్తి చేసి బేతుపల్లి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయాలని, ప్యాకేజీలు 11, 12 పనులను 2027 మే నాటికి పూర్తి చేయాలని తుమ్మల అన్నారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు పరిధిలోని సుమారు 155 ఎకరాల భూసేకరణ సమస్యలను పరిష్కరించి, పెండింగ్ టన్నెల్ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించి, పెండింగ్ బిల్లులను ప్రాధాన్య క్రమంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.