Uttam Kumar Reddy: అర్హులందరికీ రేషన్ కార్డులు.. సన్నబియ్యం పంపిణీలో తెలంగాణే దేశంలోనే మొదటి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా, ప్రస్తుతం వాటిని 2.80 కోట్లకు పెంచామని చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి అర్హతలను పరిశీలించి కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో రేషన్‌లో దొడ్డు బియ్యం వచ్చేదని, ఆ బియ్యాన్ని 80 శాతం మంది తినకుండా కిలో రూ.10కి అమ్మేసేవారని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి, నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా సన్నబియ్యం పంపిణీ జరగడం లేదని గర్వంగా చెప్పారు. 3.42 కోట్ల మందికి రూ.14,800 కోట్ల వ్యయంతో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
మేడిగడ్డ, సుందిళ్ల నుంచి చుక్క నీరు తీసుకోకుండానే దేశంలోనే ఎక్కువ ధాన్యం తెలంగాణలో పండించామని, వరి కొనుగోళ్లలో రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పదేపదే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈరోజు సంగారెడ్డి చరిత్రలోనే కాదు, తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని అన్నారు.
సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డు అంటే కుటుంబానికి గౌరవం, ఆహార భద్రత, ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని, నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు.