శాఖల కేటాయింపులో రేవంత్ మార్క్!
Revanth Mark in ministries allocation!;
ప్రభుత్వ నిర్వహణలో, కేబినెట్ కూర్పులో, వ్యవహారాలు చక్కదిద్దడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతగా పట్టుమీదున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఓ విషయంలో తన మార్క్ చూపించుకున్నారు. ఇన్నాళ్లుగా అధిష్టానం తన ముందరి కాళ్లకు బంధం వేస్తోందన్న భావనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆ శాఖల కేటాయింపులో తన ముద్ర ఉండేలా చూసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఈ నెల 8వ తేదీన మంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి తాము ఆశిస్తున్న మంత్రిత్వ శాఖల విషయంలోనూ గట్టి పట్టు పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర ఉన్న పలు కీలక మంత్రిత్వ శాఖలతో పాటు.. ఇప్పటికే ఉన్న పలువురు సీనియర్ మంత్రుల దగ్గరున్న శాఖలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ సహా అధిష్టానంపైనా ఈ విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు చర్చ జరుగుతోంది. అందుకే మంత్రిత్వ శాఖలను కేటాయించడానికి మూడు రోజుల సమయం తీసుకున్నారని అంటున్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌లోనే సీఎం పరిధిలోనే మంత్రిత్వ శాఖల కేటాయింపు జరగాల్సి ఉండగా.. హుటాహుటిన అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. రెండు రోజుల పాటు మంతనాలు సాగించింది. అయితే, ఈ మంత్రిత్వ శాఖల కేటాయింపుతో పాటు.. ఇప్పటికే మంత్రుల దగ్గరున్న శాఖల మార్పులు, చేర్పులు, తీసివేతలు కూడా ఉంటాయని అందరూ అంచనా వేశారు. తెలంగాణ కేబినెట్‌లో భారీగా ప్రక్షాళణ ఉండబోతుందన్న విశ్లేషణలు కూడా సాగాయి. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ వద్ద ఉన్న ప్రధాన శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారని కూడా చర్చలు జరిగాయి. కానీ, చివరకు సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరున్న కొన్ని శాఖలను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు కేటాయించారు.
గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు అప్పగించారు. అడ్లూరి లక్షణ్ కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ సారి మంత్రివర్గ కేటాయింపుల్లో దీనికే పరిమితమయ్యాు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అంతేకాకుండా.. ఇప్పుడు మంత్రులు డిమాండ్ చేసినట్లు ముఖ్యమైన శాఖలేవీ వారికి కేటాయించలేదు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి.. సైలెంట్‌గా మంత్రులకు శాఖలను కేటాయించారు.
సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి. అయితే, రేవంత్ రెడ్డి వాటిని కొత్త మంత్రులకు కేటాయించలేదు. వాళ్లు డిమాండ్ చేసినప్పటికీ ఆ పని చేయలేదు. పైగా.. సీనియర్లలో కొంత మంది ఆ శాఖలు తమకు కేటాయించేలా ఆదేశించాలని హైకమండ్ వద్ద లాబీయింగ్ కూడా చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్కతోనూ హైకమాండ్ సంప్రదింపులు జరిపిందని అంటున్నారు. వారు ప్రధానంగా తమకు హోంశాఖ ను కేటాయించేలా ఒత్తిడి చేశారని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం హోంశాఖను తన వద్దనే అట్టి పెట్టుకున్నారు. అంతే కాదు.. మున్సిపల్ శాఖ, విద్యా శాఖను కూడా ఇతర మంత్రులకు కేటాయించలేదు. ఇప్పటికీ కేబినెట్ లో మూడు ఖాళీగా ఉన్నాయి. ఒక వేళ ఆ మూడు స్థానాలను భర్తీ చేస్తే.. పదవులు పొందేవారికి అత్యంత కీలక శాఖలు లభిస్తాయని అనుకోవచ్చు. హైకమాండ్ తో చర్చలు , ఇతర సమీకరణాలను చూసుకుని రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు.. ఎడ్యుకేషన్, హోం, మున్సిపల్ వంటి కీలకమైన శాఖలకు ప్రత్య్యేకంగా మంత్రి లేకపోవడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని వస్తున్న విమర్శలను రేవంత్ పట్టించుకోలేదు. ఆ శాఖలను కూడా తానే చూసుకోవాలని డిసైడయ్యారు.