Revanth Reddy Government : తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ గొప్ప ఊరట: “సన్నబియ్యం పంపిణీతో ఆకలి సమస్యను అధిగమిస్తున్నాం” – సీఎం ప్రకటన

“సన్నబియ్యం పంపిణీతో ఆకలి సమస్యను అధిగమిస్తున్నాం” – సీఎం ప్రకటన

Update: 2025-12-05 12:10 GMT

Revanth Reddy Government : వరంగల్ విమానాశ్రయం కోసం గత సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రయత్నించలేదని, పదేళ్ల పాలనలో కొత్తగా ఒక్క ఎయిర్‌పోర్టును కూడా సాధించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లాను పరిదిష్టించిన ఆయన, రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లు పాలించి పేదల జీవితాలు మారలేదని, కానీ కుర్చీలో కూర్చున్నవారి ఆస్తులు పెరిగాయని ఆరోపించారు.

వరంగల్ గడ్డకు చెందిన ఎందరో వీరులు తమ పరాక్రమాన్ని ప్రపంచానికి చూపారని, కాకతీయ యూనివర్సిటీ పోరాటాలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఈ జిల్లా ప్రజలు ఆశించారని, మీ ఓటునే ఆయుధంగా మార్చి గడీల పాలనను కూల్చారని అన్నారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతోందని, వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని ఆనాటి సీఎం కేసీఆర్ అన్నారని, కానీ ఈ ప్రభుత్వం రైతు పండించిన చివరి గింజ వరకు కొంటోందని వివరించారు.

కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని, రైతు బంధు బంద్ అవుతుందని ఆనాటి సీఎం దుష్ప్రచారం చేసి ప్రజలను బెదిరించారని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్నవారి పవర్ మాత్రమే కట్ అయిందని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై పేటెంట్ హక్కు కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. గత సీజన్‌లో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామని, ఈ దేశంలో వరి అత్యధికంగా పండించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.

సన్న వడ్లకు క్వింటల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డుల్లో కొత్తవారికి చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించామని తెలిపారు. సన్నబియ్యం ద్వారా పేదల ఆకలి తీర్చుతున్నామని సీఎం ముగించారు.

Tags:    

Similar News