Sammakka Sagar: సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సాధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన నేడు (మంగళవారం) నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌తో సమావేశం కానున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి సమ్మక్కసాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీలోని అంతర్రాష్ట్ర విభాగం మినహా అన్ని డైరెక్టరేట్లు ఇప్పటికే క్లియరెన్సులు ఇచ్చాయి. కేవలం ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటే ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇస్తామని సీడబ్ల్యూసీ ఇదివరకే తేల్చిచెప్పింది.

2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సమ్మక్కసాగర్ ప్రాజెక్టు అనుమతులపై దృష్టి పెట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసారి స్వయంగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌ను కలుసుకొని చర్చించారు. ఆ తర్వాత రెండుసార్లు హైదరాబాద్, న్యూఢిల్లీలో కూడా ఛత్తీస్‌గఢ్ సీఎంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ముంపుపై అధ్యయనానికి నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చింది.

సమ్మక్కసాగర్ బ్యారేజీతో ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకునే ముంపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖరగ్‌పూర్ ఐఐటీతో అధ్యయనం చేయించగా, బ్యారేజీ వద్ద 87 మీటర్ల గరిష్ఠ వరదతో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ 83 మీటర్లు కాగా, అక్కడిదాకా ముంపునకు గురయ్యే భూములకే పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే తేల్చిచెప్పింది. తాజాగా ఐఐటీ-ఖరగ్‌పూర్ అధ్యయనంతో ముంపు 100 ఎకరాలుగా స్పష్టత వచ్చింది.

రూ.9,257 కోట్లతో చేపట్టిన తుపాకులగూడెం బ్యారేజీలో 95 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఈ బ్యారేజీలో నీటిని నిల్వ చేసి బ్యాక్‌వాటర్‌ను దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయడం ద్వారా పూర్వ ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతుండటంతో ప్రాజెక్టు ఎన్‌వోసీపై సానుకూల సంకేతాలు వస్తున్నాయి. నీటిపారుదల శాఖ అధికారుల బృందం ఇప్పటికే నయా రాయ్‌పూర్‌కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకొని మళ్లీ డీపీఆర్ దాఖలు చేయనుంది.

Tags: