Revanth’s Challenge: రేవంత్ సవాల్: అసెంబ్లీకి రావా కేసీఆర్?.. నీళ్లు-నిజాలపై ముఖాముఖి చర్చ!
నీళ్లు-నిజాలపై ముఖాముఖి చర్చ!
Revanth’s Challenge: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదంపై శాసనసభలో రెండు రోజుల చొప్పున చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) చర్చకు వస్తానని అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
"అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించాలని కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నాం. ఆయనకు గౌరవ మర్యాదలు కల్పిస్తాం. ఎవరైనా భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం. నీళ్లు-నిజాలపై సభలో ముఖాముఖి చర్చ చేద్దాం. కేసీఆర్ అనుభవంతో ఇచ్చే సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది" అని రేవంత్ స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. "కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే చాలని కేసీఆర్ సంతకం పెట్టారు. ఇది రాష్ట్రానికి మరణశాసనం రాసినట్లే. ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత హక్కులు ఇచ్చేశారు. పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు పెను అన్యాయం చేశారు. ఆయన హయాంలోనే ఏపీ జలదోపిడీ జరిగింది" అని రేవంత్ మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్‌ను 'ఆర్థిక ఉగ్రవాదులు' అని పిలిచిన రేవంత్, రాష్ట్రాన్ని రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. "అధిక వడ్డీలకు రూ.26 వేల కోట్లు, మరో రూ.85 వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఇప్పుడు కేంద్రంతో మాట్లాడి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొస్తున్నాం. ఏటా రూ.4 వేల కోట్ల భారం తగ్గుతుంది" అని చెప్పారు.
కేసీఆర్ కుటుంబంలోనే సమస్యలున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. "కుమారుడు కుర్చీ కోసం, అల్లుడు ఆస్తుల కోసం పోటీ పడుతున్నారు. హరీశ్ రావు పార్టీ ఆస్తులపై కన్నేశారు. ఫాంహౌస్ నుంచి బయటకు రావడానికి ఇదే కారణం" అని అన్నారు.
కేంద్రంతో సంబంధాలపై రేవంత్, "పనులు చేయించుకోవడానికే దిల్లీ వెళ్తున్నా" అని స్పష్టీకరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జనవరిలో జరుగుతాయని, తేదీలు త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. కేసీఆర్ సభకు రాకపోతే ప్రతిపక్ష నేత హోదా గురించి బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.