Bhatti Vikramarka: వామపక్షాల బలోపేతమే ప్రజాస్వామ్య రక్షణకు కీలకం- మతతత్వ, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలి: భట్టి విక్రమార్క
మతతత్వ, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలి: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే వామపక్ష శక్తులు బలపడాల్సిన అవసరం ఉందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అభిప్రాయపడ్డారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా అన్ని వామపక్ష పార్టీలు ఏకతాటిపై నిలిచి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజల ఓటు హక్కు సహా ప్రాథమిక హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మోదీ సర్కారును గద్దె దించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖమ్మం మామిళ్లగూడెంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు కొనసాగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘నేటి భారతదేశం - వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో డి.రాజా ప్రసంగించారు. బ్రిటిష్ వలసవాదులతో రాజీపడిన ఆర్‌ఎస్‌ఎస్‌కు పోరాట చరిత్ర లేదని ఆయన విమర్శించారు. కేరళలో వామపక్ష కూటమి తిరిగి అధికారంలోకి రావాలని, పశ్చిమ బెంగాల్‌లో బలపడి అధికారం చేపట్టాలని, తమిళనాడు, పుదుచ్చేరిలలో లౌకికవాదాన్ని కాపాడాలని ఆయన కోరారు. భాజపాను ఆ రాష్ట్రాల్లో అడుగుపెట్టనివ్వకూడదని నొక్కి చెప్పారు.
రాజ్యాంగ మార్పుల కుట్రపై విమర్శలు
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో భాజపా కీలుబొమ్మగా మారిందని, పార్లమెంటరీ వ్యవస్థను, జనాభా గణనను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఎన్‌కౌంటర్ల పేరిట మావోయిస్టులను చంపడం నాగరిక సమాజం ఆమోదించదని, ఓటర్ల జాబితా నుంచి వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం భారత ప్రయోజనాల కంటే ఇజ్రాయెల్, అమెరికా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య రక్షణ, అణుశక్తి రంగాల ప్రైవేటీకరణ వెనుక కార్పొరేట్ ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఏఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ మాట్లాడుతూ కాలానికి తగినట్లు కమ్యూనిస్టులు పనిచేస్తే అద్భుత విజయాలు సాధ్యమన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు
కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. భాజపా ప్రభుత్వం రాజ్యాంగంలో మార్పులు చేయాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ రక్షణే సామాన్యుల హక్కులకు హామీ అని, కార్పొరేట్, ఫాసిస్టు శక్తుల సవాళ్లకు అడ్డుకట్ట వేయాలంటే ఐక్య పోరాటాలు తప్పనిసరని అన్నారు. వామపక్ష భావజాలం ఉన్న పార్టీలు బలంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశం ఇచ్చిందని గుర్తుచేశారు.
కార్యక్రమంలో ఎంపీ సందోష్ కుమార్, పలువురు నేతలు పాల్గొన్నారు. వందేళ్ల సీపీఐ.. వెయ్యేళ్లు వర్ధిల్లు అనే పాటల సీడీని భట్టి, డి.రాజా ఆవిష్కరించారు.