Minister Sridhar Babu: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం.. హిల్ట్ పాలసీతో హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణ: మంత్రి శ్రీధర్ బాబు
హిల్ట్ పాలసీతో హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణ: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, రేపటి తరాల భవిష్యత్ కోసం ఈ పాలసీని తీసుకొస్తున్నామని వివరించారు.
‘‘తెలంగాణ రైజింగ్ సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాము. ఈనెల 19న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు వెళుతున్నాం.. అక్కడ కూడా భారీగా పెట్టుబడులు తీసుకురావాలనే విశ్వాసం ఉంది’’ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హిల్ట్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూడకుండా, దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని అన్నారు. ఈ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మారుస్తామని, ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలి వైపునకు తరలిస్తామని చెప్పారు.
ఈ పాలసీ మేము కొత్తగా చేస్తున్నది కాదని, దీనికోసం విస్తృతంగా చర్చలు జరిగాయని మంత్రి వివరించారు. వనరులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. హిల్ట్ పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, పారిశ్రామికవేత్తల భూములను ప్రభుత్వ భూములుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ ఎంఎస్ 19కు సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చిందని గుర్తు చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి భూములు కన్వర్ట్ చేస్తామని తెలిపారు.
‘‘నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించడమే మా ముఖ్య లక్ష్యం. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు హేతుబద్ధత, శాస్త్రీయత ఉండాలని చూస్తున్నాం. భవిష్యత్ గురించి ఆలోచించే మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని మంత్రి శ్రీధర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పాలసీల ద్వారా సుస్థిర అభివృద్ధిని సాధించి, తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.