Deputy CM Bhatti Vikramarka: కొరియా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై తెలంగాణ దృష్టి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Deputy CM Bhatti Vikramarka: దక్షిణ కొరియా సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించిన ‘కొరియన్ కల్చరల్ డే ఇన్ హైదరాబాద్-2026’ వేడుకకు ఆయన హాజరై మాట్లాడారు. ఆ దేశ సాంస్కృతిక దినోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రిని కొరియా కాన్సుల్ జనరల్ హైదరాబాద్ చుక్కపల్లి సురేశ్ సన్మానించారు.
‘‘దక్షిణ కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌ల మధ్య సహకారం పెరగాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాలలో దక్షిణ కొరియా సంస్థలతో కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలున్నాయి. పర్యాటక రంగంలో ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇరు ప్రాంతాల యువత విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని భట్టి పేర్కొన్నారు.
రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి లీ సుంగ్-హో మాట్లాడుతూ హైదరాబాద్ అందమైన నగరమని అన్నారు. దక్షిణ కొరియా, తెలంగాణ మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడంలో సాంస్కృతిక దినోత్సవం కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా కాన్సుల్ జనరల్ చుక్కపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కొరియా సంప్రదాయ నృత్యాలు, కె-పాప్ ప్రదర్శనలతోపాటు తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.