Revenue Minister Ponguleti Srinivasa Reddy: బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాలను సరికొత్త శోభతో టెంపుల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించిందని, అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

బుధవారం భద్రాచలంలో పర్యటించిన మంత్రి, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.300 కోట్లతో దేవస్థానం చుట్టూ, ఉత్తర ద్వారం తదితర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. 200 ఏళ్లు నిలిచేలా, భవిష్యత్తు తరాలు మెచ్చేలా అద్భుతంగా నిర్మిస్తున్నామని చెప్పారు. ముక్కోటి ఏకాదశి (డిసెంబరు 20) నాటికి ప్రధాన నిర్మాణాలను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.

రంగనాయకులగుట్ట వద్ద రూ.5.45 కోట్లతో తాగునీటి రిజర్వాయర్, బోర్లు, పైపులైన్లు, పంపులు, ఘాట్‌ల వద్ద మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నూతన మార్కెట్‌లో రూ.ఒక కోటితో గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పుష్కరాల పనులపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 19న తెప్పోత్సవం, 20న ముక్కోటి మహోత్సవంలో భక్తులకు సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాల సమయంలో భద్రాచలానికి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసి, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి పనులను సమీక్షిస్తుందని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీర ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన అనుభవం కల్పించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి వెంట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకు ముందే అన్ని పనులు పూర్తి చేసి భక్తులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

Tags: