Gone Prakashrao : రామోజీ ఫిలిం సిటీలో అసైన్డ్, భూదాన్ భూములు ఉన్నాయి
త్వరలో సీయం రేవంత్ రెడ్డిని కలసి ఫిర్యాదు చేస్తా-గోనె ప్రకాష్‌రావు;
రామోజీ ఫిలిం సిటీలో భూదాన్ భూములు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్, అసైన్డ్ భూమలు మొత్తం కలిపి 1700 ఎకరాలు ఉన్నాయని మాజీ శాసనసభ్యుడు గోనె ప్రకాష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న 3000 ఎకరాల్లో సగానికి పైగా భూములు భూదాన్, ఆసైన్డ్ భూములే అని చెప్పారు. నాగన్‌పల్లి గ్రామంలో 14 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి రామోజీ ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నారని తెలిపారు. అలాగే నాగన్‌పల్లి నుంచి అనాజ్‌పురం వరకు ఉన్న ప్రభుత్వ రోడ్డును ఆక్రమించుకున్నారన్నారు. ఈ భూములన్నీ బలహీనవర్గాల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పంపిణీ చేశారని గోనె ప్రకాష్ రావు గుర్తు చేశారు. 16 గ్రామాలకు చెందిన దాదాపు 90వేల మంది ప్రజలు రామోజీ ఫిలిమ్ సీటీ ఆక్రమణల వల్ల ఇబ్బందులు పడుతున్నారని గోనె ప్రకాష్‌రావు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం జరిగిందని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి ఈ మొత్తం వ్యవహరంపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు పేర్కొన్నారు.