Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ చనిపోయి బిజెపిని బతికించింది
భయపడితే నేను రేవంత్ రెడ్డిని ఎట్లైతా;
అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ కేసీఆర్‌ని కాపాడాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీయం గురువారం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అవయవ దానంతోనే బీజేపీ 8 సీట్లు గెలుచుకుందని సీయం వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ చనిపోయి బిజెపిని బతికించిందన్నారు. గొర్రెల స్కామ్‌లో గానీ ఫార్ములా ఈ రేసు కేసులో కానీ, జీహెచ్‌ఎంసీ అధికారి శివబాలకృష్ణ కేసుల్లో ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సీయం అడిగారు. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన ఈడీ, రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో జోక్యం చేసుకుంటున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కలసి కేసీఆర్ ఫ్యామిలీపై ఉన్న కేసులను ఎందుకు ఫాలో అప్ చేయడం లేదని సీయం రేవంత్ రెడ్డి నిలదీశారు. రాష్ట్ర దర్యాప్తు సంస్ధలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని, నాకు వ్యక్తులు ముఖ్యం కాదని రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రిజర్వేషన్లు 50 శాతం మించడం కుదరదని కేసీఆర్ చట్టం చేశారని ఆ క్రమంలోనే 2018లో రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను గంజాయి బ్యాచ్ కి భయపడనని, నేను భయపడితే రేవంత్ రెడ్డిని ఎట్లైతానన్నారు. వ్యవస్ధకు మాత్రమే తాను భయపడతానన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే మహరాష్ట్ర, గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో అమలవుతున్న ముస్లీం రిజర్వేషన్లను తొలగించి తెలంగాణలో తీసేయమని అడగమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సెప్టెంబర్ 30వ తేదీ లోపల స్థానిక సంస్ధల ఎన్నికలు పూర్తి చేస్తామని సీయం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇండియా పాకిస్తాన్లు కూడా నీటి పంపకాలు చేసుకుంటున్నాయని, గతంలో కేసీఆర్… చంద్రబాబు, జగన్లతో మాట్లాడినప్పుడు విజయాలుగా చెప్పుకున్నారని ఇప్పుడు నేను సమావేశంలో పాల్గొంటే తప్పుపడుతున్నారని సీయం మండిపడ్డారు. చర్చలకు వెళ్లకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జై తెలంగాణ అనడం లేదని నా మీద ఏడ్చేవాళ్లు వాళ్ళ పార్టీకి తెలంగాణ పేరును ఎందుకు తొలగించుకున్నారో చెప్పాలన్నారు.