Minister Vivek Venkataswamy: సర్పంచ్ ఎన్నికల ఓటమి జీర్ణించుకోలేక పిచ్చిగా మాట్లాడుతున్నారు కేసీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి
పిచ్చిగా మాట్లాడుతున్నారు కేసీఆర్: మంత్రి వివేక్ వెంకటస్వామి
బీఆర్‌ఎస్ పార్టీ టైర్ పంక్చర్ అయిందని విమర్శ.. గజ్వేల్‌లో 90కిపైగా సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం
Minister Vivek Venkataswamy: బీఆర్‌ఎస్ పార్టీ టైర్ పూర్తిగా పంక్చర్ అయిపోయిందని, అందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భరించలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్‌లో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 90కిపైగా సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంతో కేసీఆర్ గుండెలో గుబులు పుట్టాయని ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై "తోలు తీస్తా" అంటూ అనవసర విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కేసీఆర్ తనను గెలిపించిన గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇప్పుడు ఖాళీగా కూర్చుని అనవసరంగా మాటలు పేలుతున్నారని విరుచుకుపడ్డారు. దుబ్బాకలో గతంతో పోలిస్తే ఎక్కువగా 56 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారని, సిద్దిపేటలో గతంలో సర్పంచ్ అభ్యర్థులు దొరకడం కష్టమైనా ఇప్పుడు ప్రతి స్థానంలో అభ్యర్థులను నిలబెట్టి కొన్ని చోట్ల విజయాలు సాధించామని చెప్పారు. ఇదంతా పార్టీ కార్యకర్తల కష్టఫలితమేనని కొనియాడారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, అందుకే ఈ విజయాలు సాధ్యమయ్యాయని మంత్రి అన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని, అప్పుడే నాయకులకు ప్రజలకు మధ్య బలమైన బాంధవ్యం ఏర్పడుతుందని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు మరింత నిధులు, ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరానని వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బలం లేదని అన్నవారు.. ఇరవై వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించామని గుర్తు చేశారు.
గెలిచిన సర్పంచులందరినీ ముఖ్యమంత్రితో కలిపి పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి.. మీ శ్రమ గొప్పది, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు అద్భుతమైన జోష్ చూపించారని ప్రశంసించారు.