Union Minister Kishan Reddy: కాంగ్రెస్‌ సర్కారుకు గుణపాఠం చెప్పాలి: కిషన్‌రెడ్డి

సర్కారుకు గుణపాఠం చెప్పాలి: కిషన్‌రెడ్డి

Update: 2025-10-22 02:56 GMT

Union Minister Kishan Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించి రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హతే లేదని విమర్శించారు. భారత రాష్ట్ర సమితికి ఓటు వేస్తే అది మూసీ నదిలో పారబోసినట్లే అవుతుందని హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌ భాజపా అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు సందర్భంగా మంగళవారం జరిగిన ర్యాలీలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఎటు చూసినా సమస్యలు మాత్రమే కనిపిస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, పెళ్లికి తులం బంగారం, 4 లక్షల ఉద్యోగాలు, దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు, బీసీల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు వంటి కాంగ్రెస్‌ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌లాగే రేవంత్‌రెడ్డి కూడా మాటలు మాత్రమే చెబుతున్నారని, రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయిందని విమర్శించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువ కాలంలోనే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి మజ్లిస్‌ మద్దతు ఇస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య ఉండి సమస్యలు వినే దీపక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆ రెండు పార్టీలు సమానమే: బండి సంజయ్‌

భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ రెండూ ఒకేలా ఉన్నాయని, వాటి పాలనలో జూబ్లీహిల్స్‌ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. భాజపాను ఓడించేందుకు దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్న మజ్లిస్‌ జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌లకు ఎంఐఎంతో రహస్య అవగాహన ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌పై కోపంతో భారత రాష్ట్ర సమితికి ఓటు వేయవద్దని, భాజపాను గెలిపించి ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని సంజయ్‌ పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని మార్పు దిశగా తీసుకెళ్లే పాలన కోసం జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక చాలా ముఖ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. దీపక్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దీపక్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, భాజపా శాసనసభాపక్షనేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌ రెడ్డి, కొమరయ్య, నాయకులు చింతల రామచంద్రారెడ్డి, గౌతంరావు తదితరులు పాల్గొన్నారు.

రూ.6.25 కోట్ల స్థిరాస్తులు

లంకల దీపక్‌రెడ్డికి రూ.6.25 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని, ఆయన భార్య హరితారెడ్డికి రూ.1.10 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు నామినేషన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనపై 4 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని వివరించారు. రూ.8.14 లక్షల బ్యాంకు రుణం ఉందని తెలిపారు. తన చరాస్తుల విలువ రూ.37.50 లక్షలు, భార్య చరాస్తుల విలువ రూ.94.13 లక్షలుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News