Kavitha: సిద్దిపేటకు స్వాతంత్య్రం తెస్తాం.. రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: కవిత
కవిత
Kavitha: టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్దిపేటలో హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, సిద్దిపేటకు ఇంకా స్వాతంత్య్రం రాలేదని, ప్రజలు నాయకులు భయం గుప్పెట్లో బతుకుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేటకు స్వాతంత్య్రం తెస్తామని ప్రకటించారు. శుక్రవారం సిద్దిపేటలో కోటి లింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రంగధాంపల్లి వద్ద జిల్లా టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. హరీశ్ రావును రాజకీయం నుంచే కాకుండా ప్రజాజీవితం నుంచి తరిమేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
హరీశ్ రావు నీళ్లదొంగ అనుకున్న కానీ బొగ్గు దొంగ కూడా అని ఈ మధ్యనే తెలిసిందన్నారు. 1200 మంది అమరవీరులకు దొరికిన అగ్గిపెట్టె హరీశ్ రావుకు ఎందుకు దొరకలేదని ప్రశ్నించారు. ఈనెల 19న సిద్దిపేటలో జరిగే సభలో హరీశ్ రావు అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిలో తనకు పైసా భాగస్వామ్యం లేదని చెప్పారు. తెలంగాణ పోరాటానికి కేసీఆర్ను సిద్దిపేట ఆశీర్వదించి పంపిందని, ఇప్పుడు తనకు సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన చేస్తోందని విమర్శించారు.
మరోవైపు నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, కరువు పరిస్థితులు నెలకొన్నాయని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కరువు మండలాలుగా ప్రకటించాలని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర చరిత్రలో రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని కరువు పరిస్థితులను ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు.
ఇంటర్ బోర్డు రద్దు అంశంపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కవిత వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. భైరవ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని, యాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. హరీశ్ రావు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని చట్టపరంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీసీఐడీకి లేఖల ద్వారా సంబంధిత ఆధారాలను అందజేస్తున్నామని వెల్లడించారు.