CM Revanth Reddy: ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్‌. రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గోషామహల్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి, సమాజం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ మార్పులు చేసుకుంటోందని చెప్పారు.పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం వెల్లడించారు. 4,773 కానిస్టేబుల్‌ సహా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని, 2028 నాటికి పోలీసు శాఖలోని అన్ని ఖాళీలను విడతల వారీగా భర్తీ చేస్తామని ప్రకటించారు. 112 మంది డీఎస్పీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేశామని, ఎక్స్‌గ్రేషియా హోదా ప్రకారం రూ.కోటికి పైగా పెంచామని తెలిపారు.పోలీసు ఉద్యోగుల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్‌ ఏర్పాటు చేశామని, హోంగార్డుల కుటుంబాలకు వైద్య భద్రత కల్పించే చర్యలు చేపట్టామని సీఎం చెప్పారు. టెక్నాలజీ పెరిగినా మానవీయ దృక్పథం తగ్గకూడదని సూచించారు. రాష్ట్ర యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చర్యలు తీసుకున్నామని, డ్రగ్స్‌ కట్టడిలో రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో తొలి స్థానం సాధించిందని గర్వంగా పేర్కొన్నారు.ఆహార కల్తీ కట్టడికి ‘టీజీ సేఫ్‌’ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్‌ నియంత్రణ బాధ్యతలు అప్పగించి సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. బాధితులు, సామాన్యులు, అమాయకుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్‌ చేయాలని, నేరస్థులు, కబ్జాదారులు, డ్రగ్స్‌ దందా చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Tags: