World Economic Forum summit: తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతం
దావోస్ పర్యటన విజయవంతం
World Economic Forum summit: ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం 'తెలంగాణ రైజింగ్-2047' విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి ప్రయాణంలో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులు భాగస్వాములమవుతామని హామీ ఇచ్చారు.
దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ లక్ష్యాలు, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో-అప్ సదస్సుల ప్రతిపాదనలపై చర్చ జరిగింది.
దావోస్ సదస్సులో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించేందుకు ప్రతి ఏటా జులై నెలలో హైదరాబాద్‌లో ఫాలో-అప్ సమావేశం నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్, క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రతిపాదనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ బృందం సానుకూలంగా స్పందించింది. సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది 'సమ్మర్ దావోస్' జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి చూపుతోందని వెల్లడించారు.
'తెలంగాణ రైజింగ్-2047' విజన్‌లో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం, రోడ్‌మ్యాప్‌ను సీఎం వివరించారు. ఈ విజన్‌లోని విభిన్న కోణాలు పరస్పర సహకారానికి అవకాశాలు కల్పిస్తాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో బయోఏషియా 2024లో ప్రారంభించిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) పురోగతిపై చర్చ జరిగింది. భారత్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ ఇదేనని గుర్తుచేశారు. పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికల్లో ఉత్తమ పద్ధతులపై సీ4ఐఆర్ పరిశోధనల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'క్యూర్, ప్యూర్, రేర్' ఆర్థిక అభివృద్ధి వ్యూహం, భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. ఇది నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గతంలో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లే, ఈ సదస్సులో కూడా 'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పే సంకల్పం నెరవేరింది. జీసీసీలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకార అవకాశాలు విస్తరిస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో అమెరికాకు బయలుదేరనున్నారు.