Young India Skills University: మార్చి నాటికి సిద్ధం.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
యూనివర్సిటీ
Young India Skills University: భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మరో ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని టీజీఐఐసీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. మార్చి నెలాఖరు లోపు విశ్వవిద్యాలయం పూర్తయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు.
అధునాతన సౌకర్యాలతో పరిపాలనా భవనం, తరగతి గదులు, విద్యార్థుల వసతిగృహాలు, ఆచార్యుల నివాసాలను రూ.230 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. పరిపాలనా భవనం, ప్రవేశ ద్వారం డిజైన్లను ప్రత్యేకంగా రూపొందించారు.
డిసెంబరు 7 నుంచి మూడు రోజులపాటు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఈ విశ్వవిద్యాలయాన్ని వేదికగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల కిందట అధికారులను ఆదేశించడంతో సదస్సు పనులతో పాటు వర్సిటీ నిర్మాణం కూడా సమాంతరంగా వేగంగా జరుగుతోంది. సదస్సు కోసం పరిపాలనా భవనం, తరగతి గదుల బ్లాక్లను ఉపయోగించనున్నారు. వందల మంది హాజరయ్యే నేపథ్యంలో వేదికలు విశాలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్సిటీ ప్రాంగణంలోని మైదానంలో ప్రదర్శనల కోసం తాత్కాలిక నిర్మాణాలు చేపట్టనున్నారు.
నవంబరు 15 నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. గ్లోబల్ సమిట్కు సమాంతరంగా నిర్మాణం జరుగుతోంది.