ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టెహ్రాన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 110 మంది భారతీయ విద్యార్థులను ఇరాన్ నుంచి అర్మేనియాకు సురక్షితంగా తరలించారు. వీళ్లంతా ప్రత్యేక విమానంలో ఆర్మేనియా నుంచి బుధవారం ఢిల్లీకి రానున్నారు.

ఇజ్రాయెల్‌ "ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరుతో ఇరాన్‌పై క్షిపణి దాడులు ప్రారంభించినప్పటి నుంచి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ దాడుల ద్వారా ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించగా, ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో తీవ్ర ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 20 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో, టెహ్రాన్‌లో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. వారు తక్షణమే నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరాలని సూచించింది. అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు టెహ్రాన్ ఎంబసీ ఈ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది:

+98 9010144557

+98 9128109115

+98 9128109109

అలాగే, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా తగిన హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి భారతీయులు ఈ హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చని సూచించింది. అలాగే, ఈమెయిల్ ఐడీలు కూడా అందించింది.

+972 54-7520711

+972 54-3278392

Email: [cons1.telaviv@mea.gov.in](mailto:cons1.telaviv@mea.gov.in)

భారత ప్రభుత్వం అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తుండగా, అక్కడ చిక్కుకు పోయిన మిగతా భారతీయుల తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.


Tags: