చైనాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు - 9 మంది దుర్మరణం

Explosion at fireworks factory in China - 9 dead;

Update: 2025-06-17 12:02 GMT

చైనాలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య చైనాలో ఉన్న ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఈ భారీ పేలుడులో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. హునాన్ ప్రావిన్స్ లోని లిన్ లీ కౌంటీలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చైనా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన వీడియోల్లో దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. భారీ పేలుడు కారణంగా కంపెనీ పరిసరాల్లో దట్టమైన పొగ, ఎగిసి పడుతున్న మంటలు కనిపిస్తున్నాయి. ఈ శక్తివంతమైన పేలుడు కారణంగా ఆ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పలు భవనాలు కుప్పకూలాయి. భవనాలు కూలుతున్న సమయంలో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.



సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టపాసుల ఫ్యాక్టరీ కావడంతో సహాయ చర్యలు చేపడుతున్న సమయంలోనూ మరిన్ని పేలుళ్లు సంభవించాయి. దీంతో, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మంటలు ఆర్పేందుకు నీటి వనరులు లేని పర్వత ప్రాంతాల్లో ప్రమాద స్థలం ఉండటంలో మంటలు ఆర్పడం పెద్ద సవాల్ అయ్యింది. దాదాపు 20 గంటలకు పైగా రెస్క్యూ టీం రిమోట్ కంట్రోల్డ్ వాటర్ ఫిరంగులతో మంటలు ఆర్పేసింది.


Tags:    

Similar News