బ్రిటన్‌లో భారీగా పెరిగిన భారతీయ కంపెనీలు

Indian companies have grown significantly in Britain;

Update: 2025-06-19 09:57 GMT

బ్రిటన్‌లో భారతీయుల యాజమాన్యంలోని సంస్థలు ఆర్థికంగా సుస్థిరంగా ఎదుగుతూ, దేశానికి ఆదాయాన్ని అందించడమే కాక, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 2024లో 971గా ఉన్న భారతీయ కంపెనీల సంఖ్య 2025 నాటికి 23 శాతం పెరిగి 1,197కు చేరిందని ‘ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్’ నివేదిక వెల్లడించింది. గ్రాంట్ థోర్న్టన్ సంస్థ 2017 నుంచి ట్రాక్ చేస్తున్న డేటాలో ఇదే అత్యధిక సంవత్సర వృద్ధిగా నిలిచింది. ఈ కంపెనీల ద్వారా 2024లో 68.09 బిలియన్ పౌండ్ల ఆదాయం లభించగా, 2025 నాటికి అది 72.14 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ప్రస్తుతం ఈ సంస్థలు బ్రిటన్‌ వ్యాప్తంగా 1,26,720 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. గత ఏడాది ఒక్కసారిగా 8,000కు పైగా కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించినట్టు వివరాలు వెల్లడయ్యాయి. మహిళా డైరెక్టర్ల నిష్పత్తి 2024లో 21 శాతంగా ఉండగా, తాజా గణాంకాల ప్రకారం 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 74 కంపెనీలు 10 శాతం లేదా అంతకంటే అధిక ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి.



గ్రాంట్ థోర్న్టన్ భాగస్వామి అనుజ్ చండే ఈ నివేదికను ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలకు ప్రతీకగా అభివర్ణిస్తూ, బ్రిటన్‌ను భారత కంపెనీలు పెట్టుబడులకు ప్రముఖ కేంద్రంగా భావిస్తున్నాయని తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో రూపొందిన ఈ నివేదికలో ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) కూడా భాగస్వామిగా ఉంది. లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్-II సెంటర్‌లో జరిగిన ఐజీఎఫ్ లండన్ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో బ్రిటన్ వ్యాపార శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ నివేదికను విడుదల చేశారు. వృద్ధి ర్యాంకింగ్‌లో విప్రో ఐటీ సర్వీసెస్ యూకే సొసైటాస్ 448 శాతం ఆదాయ వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. 197 శాతం వృద్ధితో జోహో కార్పొరేషన్ లిమిటెడ్ రెండో స్థానంలో ఉంది. ప్రధాన కార్యాలయాల పరంగా చూస్తే, మొత్తం ట్రాకర్ సంస్థల్లో 47 శాతం కంపెనీలు లండన్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ (24.3 శాతం) ఉంది. రంగాలవారీగా టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్ (TMT) రంగం 31 శాతంతో ముందంజలో ఉండగా, ఫార్మాస్యూటికల్స్, రసాయనాల రంగం 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం 9.5 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. ఇండియన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లండన్ గ్లోబల్ ఫైనాన్స్ హబ్‌లో తమ వ్యూహాత్మక విస్తరణను కొనసాగిస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.


Tags:    

Similar News