ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలకు శాస్త్రీయ విచారణ – ఐసీఎంఆర్ నోడ్
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై ఐసీఎంఆర్ పరిశోధనకు గ్రీన్ సిగ్నల్ – రూ.6.2 కోట్ల గ్రాంట్

ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన
ఐసీఎంఆర్ ఆమోదం-రూ. 6.2 కోట్లు మంజూరు
ఆంధ్ర వైద్య కళాశాలలో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు
కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో అధికంగా ఉన్న కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేపట్టేందుకు ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ పరిశోధన పూర్తిచేసేందుకు మూడు దశల్లో ఐసీఎంఆర్ రూ.6.2 కోట్లను గ్రాంటు రూపంలో ఇస్తుందని ప్రకటించారు. సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసరించి వైద్య ఆరోగ్య శాఖ ఉద్ధానంలో పరిశోధన నిమిత్తం ఐసీఎంఆర్ తో ఈ ఏడాది మార్చి నుంచి జరిపిన సంప్రదింపులు ఫలించాయని మంత్రి తెలిపారు. ఐసీఎంఆర్ 'డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్' కింద పరిశోధన నిర్వహణకు ఇటీవల ఆమోదం తెలపడాన్ని మంత్రి సత్యకుమార్ స్వాగతించారు.
ఒకటి, రెండు ఏళ్లల్లో కిడ్నీ వ్యాధుల బారిన పడేవారిని గుర్తించేలా..
'శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్" పేరుతో జరిగే ఈ పరిశోధనలో భాగంగా పరీక్షించే వారిలో ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధుల బారినపడే వారిని గుర్తించి, ముందుగానే చికిత్స అందించేందుకు అవకాశమేర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనడం ద్వారా ఉద్దానం ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి వివరించారు. అతి త్వరలోనే పరిశోధన ప్రారంభమవుతుందని తెలిపారు.
తొలి విడతలో 5,500 మంది నుంచి రక్త, మూత్ర నమూనాల సేకరణ
వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, సీనియర్ నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రవిరాజ్ మార్గదర్శకంలో ఆంధ్ర వైద్య కళాశాల ద్వారా నెఫ్రాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ జి.ప్రసాద్ పంపిన ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకుని పరిశోధనకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉద్దానంలో శాస్త్రీయ విధానంలో 18 ఏళ్లకు పైబడిన వారి నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరిస్తారు.
ఉద్దానం ప్రాంతంలో ర్యాండం కింద తొలి విడదలో 5,500 మందిని ఎంపిక చేసి వారికి రక్త, మూత్ర పరీక్షలు చేస్తారు. మూత్ర నమూనాలను ఆధునిక బయోమార్కర్స్ విధానంలో పరీక్షిస్తారు. దీనివల్ల బాధితులకు ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ సమస్య ఏ స్థాయిలో రావచ్చున్నది స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం కొత్త మందులు కూడా అందుబాటులోనికి వచ్చాయి. దీనివల్ల బాధితులు ముందుగానే మేల్కొని వ్యాధులు ముదరకుండా (డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి) జాగ్రత్తపడే అవకాశం ఉందని, ఉద్దానంలో గతంలో అధ్యయనం చేసిన డాక్టర్ రవిరాజ్ తెలిపారు.
జన్యు పరీక్షలు కూడా..
ఆర్ఎన్ఎ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు. దీనివల్ల బాధితులకు జన్యుపరంగా కిడ్నీ వ్యాధులు వస్తాయా? రావా? అని కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. ఉద్దానంలో ప్రతి వంద మందిలో 18% మంది కిడ్నీ పనితీరు సక్రమంగా లేదని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇక్కడ మాదిరిగా కేసులు లేవన్నారు.
ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రత్యేక ల్యాబ్
రక్త, మూత్ర నమూనాలు పరీక్షించేందుకు ఐసీఎంఆర్ ఆంధ్ర వైద్య కళాశాల(AMC)లో ప్రత్యేక ల్యాబ్ ను ఏర్పాటుచేయబోతుంది. ఇందుకు సంబంధించిన పరికరాలు/యంత్రాలు ఐసీఎంఆర్ ద్వారా వైద్య కళాశాలకు రానున్నాయి. కొత్తగా సాంకేతిక నిపుణులు, రీసెర్చ్ నిపుణులను నియమిస్తారు. తొలి ఏడాది రూ.3.04 కోట్లు, రెండో ఏడాది రూ.1.75 కోట్లు, మూడో ఏడాది రూ.1.21 కోట్లు చొప్పున ఐసీఎంఆర్ నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులతోనే ల్యాబ్ ఏర్పాటవుతుంది. వేతనాలు చెల్లింపులు జరుగుతాయి. ఇతర ఖర్చులు కూడా ఈ నిధుల నుంచే వినియోగిస్తారు. ఉద్దానంలోని వేరువేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరి, చేపలు, కూరగాయల నమూనాలు సేకరించి కూడా పరీక్షిస్తారు. వీటి ఫలితాలనుసరించి తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా ఆగిన పరిశోధన
గత తెదేపా ప్రభుత్వ (2014-19) హయాంలో జార్జ్ ఇన్స్టిట్యూట్ కు పరిశోధన బాధ్యతలు అప్పగించారు. కానీ వైకాపా ప్రభుత్వ నిర్వాకంవల్ల పరిశోధన పూర్తి స్థాయిలో జరగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి శ్రద్ద పెట్టడంతో ఉద్దానం కిడ్నీ వ్యాధి మూలాల పరిశోధనలో మళ్లీ కదలిక వచ్చింది. ఉద్దానం ప్రాంతంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, ఇతర మండలాలు ఉన్నాయి.

