రాయలసీమను ప్రపంచ నెంబర్‌ 1 చేస్తాం - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

CM Chandrababu Naidu: రాయలసీమను ప్రపంచంలోనే నంబర్‌ 1 ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ. లక్ష కోట్ల పెట్టుబడితో 40 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును విస్తరించి, 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా మరో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని వివరించారు. శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ పద్దులపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం ఈ వివరాలు వెల్లడించారు.

దేశంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నంబర్‌ 1 స్థానంలో ఉందని, రాయలసీమలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో 400 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, దీన్ని రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు.

కౌలు రైతులను ఆదుకుంటాం – పరిమిత సాగుకు సలహా

కౌలు రైతులు ఒక్కొక్కరు 30 నుంచి 40 ఎకరాలు సాగు చేస్తున్నారని, నష్టాలు వచ్చినప్పుడు కోలుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వారిని పరిమితంగా సాగు చేసేలా ప్రోత్సహిస్తామని, అండగా నిలిచే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నీటి భద్రత, సమర్థవంతమైన నిర్వహణపై దృష్టి

ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, వర్షాలు తక్కువ లేదా ఎక్కువ కురిసినా నీటి భద్రత ముఖ్యమని సీఎం చెప్పారు. "నీరుంటే ఏ పనైనా చేయవచ్చు. రైతులు, సాగునీటి సంఘాలకు అవగాహన కల్పించాలి. సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎద్దడిని నివారించవచ్చు" అని అన్నారు.

ఏలూరు వద్ద కోకో సిటీ, వాణిజ్య పంటలకు మద్దతు

బర్లీ పొగాకు, ఉల్లి, కోకో, మామిడి తదితర పంటలకు రూ. 500 కోట్ల మార్కెట్ జోక్యం చేసి రైతులను ఆదుకున్నామని తెలిపారు. అన్ని వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తామని, గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏలూరు వద్ద ప్రపంచంలోనే మొదటి కోకో సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

యాంత్రీకరణ, టెక్నాలజీ, ఉచిత విద్యుత్‌పై ఆధారపడతాం

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, టెక్నాలజీ, నాలెడ్జ్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి రైతుకు ఏఐ అగ్రానమిస్ట్ సహకారం అందేలా చూస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు పనిచేస్తున్నాయని, ఈ ఏడాది 69 వేల కనెక్షన్లు అదనంగా ఇచ్చామని వివరించారు. 2026-27లో ఉచిత విద్యుత్తుకు రూ. 13,722 కోట్లు కేటాయించామని చెప్పారు.

ప్రకృతి సేద్యం విస్తరణ, ఇతర కార్యక్రమాలు

2029 నాటికి 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం విస్తరిస్తామని, ప్రస్తుతం 17.77 లక్షల ఎకరాల్లో 15 లక్షల మంది రైతులు చేస్తున్నారని తెలిపారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆహార శుద్ధి రంగంలో రూ. 14,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.

వైకాపా పాలనలో రైతుల ఇబ్బందులు, ఆత్మహత్యలు

వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అండగా నిలుస్తామని, బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి రేటు 7.83% ఉందని, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని వివరించారు.

రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story