CM Chandrababu: దేశ రాజకీయాల్లో 1983 సార్వత్రిక పరిణామం: సీఎం చంద్రబాబు
1983 సార్వత్రిక పరిణామం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: దేశ రాజకీయ చరిత్రలో 1983వ సంవత్సరం సంచలనాత్మకమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందిన ‘సజీవ చరిత్ర’ పుస్తకాన్ని విజయవాడలోని పోరంకిలో మురళీ రిసార్ట్స్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ‘సజీవ చరిత్ర’ పుస్తకం ద్వారా 1984లో జరిగిన రాజకీయ సంఘటనలు ప్రజలకు తెలుస్తాయని తెలిపారు. 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు గుణపాఠమని, 161 మంది ఎమ్మెల్యేలతో రామకృష్ణ స్టూడియోలో క్యాంప్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో 18 నెలలకు ఒకసారి ప్రభుత్వాలు మారేవని, ప్రజాస్వామ్యానికి జరిగిన ద్రోహంపై ప్రజలు తిరగబడ్డారని, ఆ పోరాటంలో ఎన్టీ రామారావు విజయం సాధించారని చెప్పారు. ఇంద్రసేనారెడ్డి ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కీలక పాత్ర పోషించారని, వెంకయ్య నాయుడు దేశంలోని నాయకులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు.
గవర్నర్ రామ్ లాల్ ఏకపక్షంగా వ్యవహరించారని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చారని చెప్పారు. ఆ సమయంలో రామకృష్ణ హెగ్డే కర్ణాటకలో ఆశ్రయం ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రజలే దేవుళ్లని, సమాజమే దేవాలయమని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని, ఆయన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఆనాడు ఆయన ప్రారంభించిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతుందని, ఎన్టీఆర్ వేసిన బీజం ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరతకు దోహదపడుతోందని సీఎం చంద్రబాబు వివరించారు.
