చీకటి గదుల్లో కరెంట్ షాకులు, హింసలు

22 Andhra Pradesh Youth Rescued from Myanmar Cyber Hell: మయన్మార్‌లోని సైబర్ నేరాల కాంపౌండ్‌ల్లో బందీలుగా మారిన 22 మంది ఆంధ్రప్రదేశ్ యువకులను భారత ప్రభుత్వం, ఏపీ సీఐడీ సహకారంతో విజయవంతంగా రక్షించి తీసుకొచ్చింది. ఈ యువకులు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వేసిన వలలో చిక్కుకుని, చైనీయ ముఠాల ఆధ్వర్యంలోని కాంపౌండ్‌ల్లో చిత్రహింసలకు గురయ్యారు. రెండు రోజుల క్రితం భారత్‌కు చేరుకున్న ఈ బాధితులు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా, డీఎస్పీ రవికిరణ్‌లతో మాట్లాడుతూ తమ భయానక అనుభవాలను వివరించారు.

చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు, ప్రైవేటు సైన్యం అత్యాధునిక ఆయుధాలతో కాపలాగా ఉండే ఈ కాంపౌండ్‌లు జైళ్ల కంటే ఘోరంగా ఉంటాయని బాధితులు చెప్పారు. వారు చెప్పినట్లు పని చేయకపోతే చీకటి గదుల్లో బంధించి, విద్యుత్ షాకులు ఇచ్చి హింసిస్తారు. తిండి లేకుండా పస్తులు పెట్టి, భారీ వాటర్ క్యాన్లు చేతుల్లో పెట్టి గంటల తరబడి గుంజీలు తీయిస్తారు. తప్పించుకుని పారిపోదామనుకుంటే పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేస్తారని భయపెడతారు. రోజుకు 19-20 గంటలు నిద్ర లేకుండా సైబర్ మోసాలు చేయించేవారు.

ఎలా వలలో పడ్డారు?

ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్‌లో డేటా ఎంట్రీ, కాల్ సెంటర్ ఉద్యోగాలు రూ.లక్షల జీతంతో ఉన్నాయని ప్రకటనలు చూసి ఆకర్షితులయ్యారు. కొందరు ఏజెంట్ల ద్వారా వెళ్లగా, పర్యాటక వీసా, విమాన టికెట్లు పంపి మొదట థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చైనా హ్యాండ్లర్లు పాస్‌పోర్టులు, ఫోన్లు లాగేసుకుని, 12-13 గంటల అడవుల గుండా సరిహద్దు దాటించి మయన్మార్‌లోని మయవాడీ కేకే పార్క్ ప్రాంతంలోని కాంపౌండ్‌లకు చేరవేశారు.

లక్ష్యం అమెరికా ప్రవాస భారతీయులు

అమ్మాయిల ఫొటోలతో నకిలీ డేటింగ్ ఖాతాలు తెరిపించి, అమెరికాలోని ప్రవాస భారతీయులను హనీట్రాప్‌లో పడేసి, పెట్టుబడుల పేరిట డబ్బులు మోసం చేయించేవారు. ఒక్కొక్కరికి 500 నుంచి 10 లక్షల డాలర్ల వరకు మోసం చేయాలని టార్గెట్ ఇచ్చేవారు. కాదంటే తుపాకులతో బెదిరించి, చిత్రహింసలు పెట్టేవారు. మయన్మార్‌తో పాటు కాంబోడియా, థాయ్‌లాండ్, వియత్నాం, లావోస్‌లోనూ ఇలాంటి కాంపౌండ్‌లు ఉన్నాయని, వాటిలో ఇప్పటికీ వేలాది మంది భారతీయులు బందీలుగా ఉన్నారని బాధితులు వెల్లడించారు.

గత మూడు నెలల్లో 1,586 మంది భారతీయులను ఇలాంటి కాంపౌండ్‌ల నుంచి రక్షించగా, వారిలో 120 మంది ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారు. ఏపీ సీఐడీ, కేంద్ర హోం, విదేశాంగ శాఖలు, ఎన్‌ఐఏ సహకారంతో మిగిలిన వారిని కూడా త్వరలో తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఇలాంటి ఉచ్చుల్లో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story