Deputy CM Pawan Kalyan: రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని ఆయన సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త దీనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం వల్ల వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని ఆయన తెలిపారు. భావి తరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లినప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పరిశ్రమలు 33 శాతం పచ్చదనం నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్‌ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. 2026 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, సిమెంట్‌, మైనింగ్‌, ఎనర్జీ, ఆహార శుద్ధి, ప్లాస్టిక్‌, పేపర్‌, వస్త్రాలు తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు, కంపెనీలు వేలాది ఎకరాల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 14 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి, తొలి విడతగా పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు 33 శాతం పచ్చదనం లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న మహత్తర సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమాజానికి, ప్రకృతికి, రాబోయే తరాలకు విలువైన భవిష్యత్తును అందించగలమని ఆయన అన్నారు.

Next Story