Chandrababu: తెదేపా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం కోటా.. చంద్రబాబు దిశానిర్దేశం
చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరంగా బీసీలకు 40 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించేలా కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు ‘జయహో బీసీ.. జనాభాలో సగం – కూటమి ఇచ్చింది బలం’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
ఆదివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, నియోజకవర్గ పరిశీలకులు, ముఖ్య నేతలతో వర్చువల్‌గా మాట్లాడిన చంద్రబాబు.. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు రావాలని, ఇదే నేతల పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. దీన్ని బట్టే నేతలకు రేటింగ్స్ ఇస్తామని తెలిపారు. గొడ్డలి పార్టీ మూతపడేలా కూటమి అభ్యర్థులు గెలవాలని ఆదేశించారు.
‘మనం కూటమిలో ఉన్నాం. మిత్రధర్మం చాలా ముఖ్యం. పైస్థాయిలో ఉన్న సమన్వయం క్షేత్రస్థాయిలోనూ ఉండాలి. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో మూడు పార్టీలు కలిసి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. తటస్థుల్ని పార్టీ సానుభూతిపరులుగా మార్చాలి. ప్రత్యర్థి పార్టీ వారిని తటస్థుల్ని చేయాలి. రాబోయే 50 రోజులు ఎవరికీ మినహాయింపు లేదు. గెలుపు, నిజాయతీ, సమర్థత, సోషల్ రీ-ఇంజినీరింగ్‌ను బేరీజు వేసి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం’ అని చంద్రబాబు సూచించారు.
నిజాయతీగా పని చేయకుండా డ్రామాలాడేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ‘స్థానిక ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోవద్దు. కూటమి బలం మరింత పెరగాలంటే ఈ ఎన్నికలు కీలకం. ఇప్పటివరకు సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశాం. చెత్త పన్ను రద్దు చేశాం. చక్కటి రోడ్లు వేశాం. ఇరిగేషన్‌కు పూర్వ వైభవం తెచ్చాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేశాం. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం పనులకు రూ.30 వేల కోట్లతో శంకుస్థాపన చేశాం. 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేపట్టాం. మరో 3 లక్షల ఇళ్లకు భూమిపూజ చేశాం. పుర, నగరపాలికల్లో మౌలిక సదుపాయాలకు రూ.11,359 కోట్ల పనులు చేపట్టాం. 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని వివరించారు.
వైకాపా బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ‘బీసీలకు రిజర్వేషన్లు దక్కకూడదని, స్థానిక ఎన్నికలు జరగకూడదని గొడ్డలి పార్టీ న్యాయస్థానాలకు వెళ్లింది. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయాలని చూసింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారు’ అని అన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఆమోదించి బీసీలకు వీలైనంత ఎక్కువ మేలు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు భంగం కలగకుండా న్యాయం చేస్తున్నామని తెలిపారు.
‘ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇమేజ్ పడిపోవడంతో గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాల్ని ముమ్మరం చేస్తోంది. ఈ ఎన్నికలతో ఆ పార్టీకి, అభివృద్ధి నిరోధకులకు, రౌడీలు, రప్పా రప్పా టీంలకు బుద్ధి చెప్పాలి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

