CM Chandrababu: 90% సిజేరియన్లు? ప్రైవేట్ ఆస్పత్రుల ధందాపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ఆస్పత్రుల్లో 90 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, ఈ ధోరణిని తమ ప్రభుత్వం ఆమోదించదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గర్భిణులకు సురక్షిత సహజ ప్రసవాలపై అవగాహన కల్పించాలని, యోగా వంటి పద్ధతులు నేర్పించేలా పరిస్థితులు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు సూచించారు. ఈ విషయంపై ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టాలని, సంబంధిత వారిని పిలిచి మాట్లాడాలని ఆదేశించారు. అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఎప్పుడైనా సరే ఆపరేషన్.. ఆపరేషనే. భగవంతుడు ఇచ్చిన సహజ సిద్ధమైన శరీరాన్ని కోయడం మంచిది కాదు. సిజేరియన్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.. ఇది సరికాదు. ఇలాంటి పరిస్థితులను ఎలా నియంత్రించాలో ఆలోచించాలి. రాష్ట్రంలో 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. అందులో 42 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి" అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడం మనందరి ఆకాంక్ష అని, వచ్చే ఏడాదికి 5.37 కోట్ల మంది జనాభా ఉంటుందని చెప్పారు. 2047 నాటికి చైనా జనాభా 100 కోట్లకు, భారత్‌లో 162 కోట్లకు పెరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోందని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జనాభా తగ్గుతున్నప్పుడు, యూపీ, బిహార్ వల్లే భారత్‌లో బ్యాలెన్స్ ఏర్పడుతోందని అన్నారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మెడికల్ ఆఫీసర్లు కూడా ఎక్కువగానే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారని, దేశంలో సగటు జీవితకాలం 70 ఏళ్లుగా పెరిగిందని, ఇమ్యునైజేషన్ 97 శాతం, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు 78 శాతం సాధించామని, త్వరలో 100 శాతం చేస్తామని చెప్పారు. గర్భిణుల్లో అనీమియా 32 శాతంగా ఉందని కూడా పేర్కొన్నారు.
