Prime Minister Narendra Modi: స్వర్ణాంధ్ర విజన్‌-2047 సాకారానికి ఇది కీలకమైన శుభదినమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని ప్రారంభించారు. అదే సమయంలో రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలిపారు. ‘‘పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం దక్కింది. 13,500 మంది గిరిజన మహిళల థింసా నృత్యం అద్భుతంగా ఉంది. అభివృద్ధితో పాటు థింసా నృత్యంలోనూ నేడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది చంద్రబాబు విజన్‌కు మరో సాక్ష్యం’’ అని అన్నారు.

‘‘ఈరోజు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు, శరవేగంగా తీసుకెళ్తాయి. కొత్త ప్రాజెక్టులు ఎయిర్‌, రోడ్‌ కనెక్టివిటీని పెంపొందిస్తాయి. చంద్రబాబు, పవన్‌ నేతృత్వంలో ఏపీలో డబుల్‌ అభివృద్ధి జరుగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది’’ అని మోదీ చెప్పారు.

2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 166కి పెరిగిందని ఆయన గుర్తు చేశారు. ‘‘గతంలో ఒకే కుటుంబం పేర్లను విమానాశ్రయాలకు పెట్టేవారు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకి, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం. ఉడాన్‌ పథకం వల్ల చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు ఎయిర్‌ సేవలు అందుతున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజల కలలు సాకారం చేస్తున్నాం’’ అన్నారు.

విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టుల అభివృద్ధి, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతున్నాయని, పీఎం గతిశక్తి పథకంతో రైలు, పోర్టు, ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చెందుతున్నాయని మోదీ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌, ఐటీ, టెక్‌ రంగాల్లో ఏపీ యువత దూసుకుపోతోందని, విశాఖలో సెమీకండక్టర్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, నక్కపల్లిలో మరో ఫార్మా కంపెనీ రాబోతోందని ఆయన తెలిపారు.

‘‘వికసిత్‌ భారత్‌కు గ్రోత్‌ ఇంజిన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేస్తున్నాం. ఏపీ ఫార్మా హబ్‌గా మారబోతోంది. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను ఆసియాలోనే గొప్ప పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం. రాయలసీమలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం’’ అని ప్రధాని అన్నారు.

కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story