నేడు బాధ్యతలు తీసుకోనున్న రావాడ ఆజాద్‌ చంద్రశేఖర్‌

మరో తెలుగు తేజం పొరుగు రాష్ట్రంలో కీలక పదవిని చేపట్టారు. కేరళ రాష్ట్రానికి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్‌ చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. చంద్రశేఖర్‌ ని కేరళ నూతన డీజీపీగా నియమిస్తున్నట్లు సోమవారం కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. నేడు మంగళవారం చంద్రశేఖర్‌ కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. చంద్రశేఖర్‌ కేరళ పోలీసు బాస్‌ గా నయమితులవ్వడంతో వీరవాసరంలో ఉన్న ఆయన బంధుమిత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. 1991వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన చంద్రశేఖర్‌ బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుకున్నారు. కేరల రాష్ట్ర పోలీసు శాఖలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రశేఖర్‌ తన సమర్ధవంతమైన పనితీరుకు గానూ రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌ పై కేంద్ర సర్వీసులో ఉన్న చంద్రశేఖర్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఆయన్ను సెంట్రల్‌ క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ స్పెషల్‌ సెక్యూరిటీ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఆ పదవిలో చేరకుండానే చంద్రశేఖర్‌ ని కేరళ రాష్ట్ర డీజీపీగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేరళ డీజీపీగా ఉన్న ధర్వేష్‌ సాహెబ్‌ సోమవారం పదవీవిరమణ చేశారు. దీంతో ఆ రాష్ట్ర నూతన డీజీపీగా రావాడ ఆజాద్‌ చంద్రశేఖర్‌ నియమించారు.

Updated On 1 July 2025 9:57 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story