జిల్లా మార్పుపై భావోద్వేగం వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Minister Mandipalli Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రధాన చర్చ జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మార్పు అంశంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

కేబినెట్ సమావేశం అనంతరం మాధ్యమాలతో మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. తనకు తెలుగుదేశం పార్టీ మరియు రాయచోటి నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లలాంటివారని ఎమోషనల్‌గా తెలిపారు. రాయచోటి జిల్లా మార్పు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బాధపడుతున్నారని పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయని వివరించారు. రైల్వేకోడూరు ప్రజలు తిరుపతి జిల్లాను, రాజంపేట ప్రజలు కడప జిల్లాను కోరుకోవడంతో రాయచోటి ఒంటరిగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 27న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్‌లో జిల్లా కేంద్ర మార్పు గురించి ఎక్కడా ప్రస్తావన లేదని, స్వార్థం ఉంటే అప్పట్లోనే మార్చేవారమని స్పష్టం చేశారు.

గత 30 రోజుల్లో రాయచోటి జిల్లా మార్పు అంశం ఎక్కడా చర్చకు రాలేదని, చివరి రెండు రోజుల్లో సంబంధిత నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. రాయచోటికి నిజంగా అన్యాయం జరిగిందని అంగీకరిస్తూనే.. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు.

రాయచోటిపై తనకు ఉన్న ప్రేమ కారణంగానే మంత్రి పదవి ఇచ్చానని, కొన్ని అనివార్య కారణాల వల్ల మార్పు తప్పలేదని సీఎం అన్నారని మంత్రి తెలిపారు. అయినప్పటికీ రాయచోటి జిల్లాగా కొనసాగాలనే తన ఆశ ఇంకా పోలేదని, ప్రజల కోరిక మేరకు మార్పు లేకుండా ఉండాలని కోరుకుంటున్నానని భావోద్వేగంతో చెప్పారు.

ఎన్నో దశాబ్దాలుగా తన కుటుంబానికి రాయచోటితో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్న మంత్రి.. తనకు అండగా నిలిచిన ప్రజలు, జేఏసీ నేతలు, తెలుగుదేశం కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాయచోటి ప్రజలు భావోద్వేగంతో ఉన్నారని, కొందరు తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన సమయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయలేదని, ఇప్పుడు తాను కూడా అలాంటి విమర్శలు చేయనని స్పష్టం చేశారు. రాయచోటి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story