Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్యలకు రంగం సిద్ధం.. పార్లమెంట్ నిర్ణయమే కీలకం : శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు
శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు

Speaker Ayyanna Patrudu: ప్రజలు ఎన్నుకున్న వారు అసెంబ్లీకి రాకపోతే వారు ఎలా ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంపై పార్లమెంట్ నిర్ణయం కోసం వేచి ఉన్నామని ఆయన తెలిపారు.
బుధవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఈ విషయాలను వెల్లడించారు. సభకు రాని వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపానని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించి కొత్త చట్టం తీసుకురావాలని కోరానని చెప్పారు. గతంలో కొందరు ఎమ్మెల్యేలు సభకు రాకుండానే తర్వాత సంతకాలు పెట్టిన దాఖలాలున్నాయని గుర్తుచేసిన ఆయన, ఇలాంటి సమస్య మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో సభ్యులు తమ సీట్లలో కూర్చున్నప్పుడే హాజరు నమోదయ్యేలా ఫొటో క్యాప్చర్ విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. సభకు రాని ఎమ్మెల్యేలకు అమరావతిలో కొత్త క్వార్టర్లు కేటాయించాలా వద్దా అనే అంశంపై పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు.
మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని వైకాపా అధ్యక్షుడు జగన్ అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా స్పీకర్ స్పందించారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తే తనకూ అంత సమయం కావాలంటున్నారు. సభలో వారికి ఆ హోదా లేదు కాబట్టి సీఎంతో సమానంగా సమయం ఎలా ఇవ్వగలనని ఆయన ప్రశ్నించారు.
మా సభ్యులను బయటికి పంపేసి సభను నిర్వహించుకోవచ్చు కదా అని వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అంటున్నారని అడిగినప్పుడు.. జగన్ కంటే బొత్స సీనియర్ కదా? వారి పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం తప్పు అని చెప్పొచ్చు. సభకు రానప్పుడు రాజీనామా చేయాలని సూచించవచ్చు. అయినా వీటిని వదిలేసి ఏదో వంక పెడుతున్నారని స్పీకర్ వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంగా సామాన్య ప్రజలను అసెంబ్లీలో భాగస్వాములు చేసేలా ‘మన సభ-జన సభ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రతి ఆగస్టు 14, 15 మరియు జనవరి 25, 26 తేదీల్లో ఈ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని, శనివారం వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ వేడుకల్లో పాల్గొనే ప్రజలు అసెంబ్లీ లోపల కూడా చూసేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.
- AyyannaPatruduAyyannaPatruduNewsAPAssemblyAndhraPradeshAssemblyMLAsMLAAbsenceMLAAttendanceAbsentMLAsAssemblySpeakerAssemblySessionsParliamentParliamentDecisionAPPoliticsAndhraPradeshPoliticalNewsAssemblyNewsPublicRepresentativesNoWorkNoPayLatestAPNewsLatestPoliticalNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

