ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్

  • రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా కనిపిస్తోంది
  • పీఎసీఎస్‌, ఆర్బీకేల వద్ద రైతులు బారులు తీరుతున్నారు
  • వేరుశనగ, నూనెగింజల స్థానంలో 2 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు
  • నానో యూరియాను ప్రత్యామ్నాయంగా చూపడం సరికాదు

రాష్ట్రంలో యూరియా కొరతను పరిష్కరించేందుకు తక్షణం కేంద్రప్రభుత్వం నుంచి అదనపు యూరియా కేటాయింపులు తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఏపీ స్టేట్ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే... రాష్ట్రంలో పీఎసీఎస్‌, ఆర్బీకేల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరి వేచి ఉండాల్సిన పరిస్తితి కనిపిస్తోంది. యూరియా కొరత అవాస్తవం, ఎవరైనా ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా సరే పీఏసీఎస్, ఆర్బీకేల వద్దకు వెళ్ళి చూస్తే యూరియా కోసం రైతులు క్యూలైన్లలో వేచిఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యాపారులు తమ వద్ద ఉన్న నానో యూరియా, ఇతర పురుగుమందులు కొనుగోలు చేస్తేనే యూరియా విక్రయిస్తామంటూ రైతులను వేధిస్తున్నారు. అలాగే ఈ ఏడాది రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లలో వేరుశనగ, నూనెగింజల సాగుకు బదులుగా వరి, ఆహారధాన్యాలు సాగు చేశారు. నూనెగింజలు, వేరుశనగకు యూరియాతో అవసరం లేదు. దీంతో ఈ విస్తీర్ణంలోని ప్రత్యామ్నాయ పంటలకు కూడా యూరియా అవసరం ఏర్పడింది. అలాగే సీజన్ ప్రారంభంలో రైతులు వరికి యూరియాను వినియోగించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల తరువాత మొక్కజొన్న, పత్తి, కూరగాయలు, ఇతర పంటలకు కూడా యూరియా అందించాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ మొత్తం కారణాల వల్ల యూరియాకు డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితులను ముందుగానే గమనించి కేంద్రం నుంచి అదనపు కేటాయింపులు తీసుకురావడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. గతంలో పీఎసీఎస్‌, ఆర్బీకేలకు యాబైశాతం, మిగిలిన యాబైశాతం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేవారు. యూరియా డిమాండ్ నేపథ్యంలో పీఎసీఎస్‌, ఆర్బీకేలకు డెబ్బైశాతం, మిగిలిన ముప్పై శాతం మాత్రమే ప్రైవేటు వ్యాపారులకు ఇస్తామని అయిదు రోజుల కిందట వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు. నేటికీ ఇది కార్యరూపం దాల్చలేదు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

రెండో ఏడాది కోసం రైతులు యూరియాను కొనుగోలు చేసి, దాచిపెట్టుకునే పరిస్తితి లేదు. ప్రైవేటు డీలర్లు యూరియా కావాలంటే నానో యూరియా, ఇతర పురుగుమందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నానో యూరియాపై ఇప్పటి వరకు శాస్త్రీయమైన ఫలితాలను ధ్రువీకరించలేదు. పంజాబ్‌ యూనివర్సిటీ ఇఫ్కోకు ఇచ్చిన పెయిడ్ ట్రయిల్స్‌లోనే వరి, గోదుమలో దిగుబడులు, గింజల్లో ప్రొటీన్ శాతం తగ్గిందని నివేదికలు ఇచ్చారు. అలాంటి నానో యూరియాను రైతులకు అంటగట్టడం సరికాదు. రాష్ట్రంలో 69 శాతం రైతుల సగటు భూమి ఒక ఎకరం మాత్రమే. అలాగే 19 శాతం మంది రైతుల సగటు భూమి 3.5 ఎకరాలు. కౌలు, సన్నా, చిన్నకారు రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, ప్రభుత్వ చర్యలకు పోలిక లేదు. కేంద్రం నుంచి అదనపు కేటాయింపులు తీసుకువచ్చి, యూరియా కొరతను తీర్చాలని నాగిరెడ్డి కోరారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story