Adulterated Ghee Case: కల్తీ నెయ్యి కేసు: వైకాపా నేత విన్నపంపైనే చిన్న అప్పన్నకు ఆర్థిక సాయం - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సిట్‌కు వెల్లడి
మ్మెల్యే ప్రశాంతిరెడ్డి సిట్‌కు వెల్లడి

Adulterated Ghee Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సరఫరా కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఇటీవల నెల్లూరులో విచారించారు. 2019 సెప్టెంబరు నుంచి కేవలం నాలుగు నెలలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమెను టెండర్ ప్రక్రియ, నెయ్యి సరఫరా విధానాలపై ప్రశ్నించారు.
తితిదే మాజీ చైర్మన్, వైకాపా రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసిన విషయంపైనా సిట్ ఆరా తీసింది. దీనిపై ప్రశాంతిరెడ్డి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. వైకాపాలోని ఒక కీలక నేత విన్నపంతోనే మొదట నెలకు రూ.50 వేలు, తర్వాత రూ.25 వేల చొప్పున కొంతకాలం ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మానవతా దృక్పథంతో అనేకమందికి సహాయం చేస్తూనే ఉంటామని, అందులో భాగంగానే చిన్న అప్పన్నకు కూడా డబ్బు ఇచ్చామని పేర్కొన్నారు.
చిన్న అప్పన్న తమ వద్ద ఎప్పుడూ పనిచేయలేదని, పీఏగానూ లేరని ఆమె స్పష్టం చేశారు. అతనికి దిల్లీలో ఉద్యోగం ఇప్పించేందుకు సిఫారసు చేయలేదని కూడా వివరించారు. అదనంగా, టెండర్ నిబంధనలను సడలించిన సమయంలో తాను కమిటీలో లేనే లేనని చెప్పారు.
మంత్రి పార్థసారథినీ విచారణ
ఇదే కేసులో ఈ నెల 23న మంత్రి పార్థసారథిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. వైకాపా హయాంలో 2019 సెప్టెంబరు నుంచి రెండేళ్లపాటు తితిదే బోర్డు సభ్యుడిగా, కొనుగోళ్ల కమిటీలోనూ ఆయన ఉన్నారు. 2020 మార్చి నుంచి కొవిడ్ కారణంగా బోర్డు వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోలేదని, కల్తీ నెయ్యి గురించి తనకు తెలియదని ఆయన చెప్పినట్లు సమాచారం. అధికారులే అన్నీ చూసుకుంటారని సమాధానమిచ్చారు.
ఫిర్యాదుదారే నిందితుడు
మరో కీలక పరిణామంగా, కల్తీ నెయ్యి ఆరోపణలపై ఫిర్యాదు చేసిన మురళీకృష్ణకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు సిట్ భావించి ఆయనను నిందితుల జాబితాలో చేర్చింది. ఫిర్యాదు సమయంలో తితిదే ఈవోగా ఉన్న శ్యామలరావును సాక్షిగా పేర్కొన్నారు. ఆయన్ని కూడా కొన్ని రోజుల క్రితం సిట్ విచారించింది. కల్తీ అనుమానం ఎప్పుడు, ఎలా వచ్చింది? నమూనాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపిన వరకు ఉన్న సమాచారాన్ని శ్యామలరావు అధికారులకు వివరించారు.

