కేంద్ర సహాయమంత్రి అనుప్రియా పటేల్‌

మంగళగిరి ఎయిమ్స్‌లో రెండో స్నాతకోత్సవం ఘనంగా..

‘ఎర్లీ మార్నింగ్‌ యాంటీనాటల్‌ క్లినిక్‌’ ప్రారంభం

Union Minister Anupriya Patel: వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోందని, వ్యాధుల నిర్ధారణ నుంచి సంక్లిష్ట ఆరోగ్య సమస్యల పరిష్కారం వరకు ఏఐ సాధనాలు గణనీయ సహాయం అందిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ పేర్కొన్నారు. అయితే, వైద్యుల స్థానంలో ఏఐ ఎన్నటికీ ప్రత్యామ్నాయంగా నిలవలేదని, వైద్యుల అవసరాన్ని ఏ సాంకేతికతా పూర్తిగా భర్తీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన రెండో స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైద్య చికిత్స కోసం సామాన్యులు తమ ఆస్తులను కోల్పోకుండా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం-జేఏవై పథకం ద్వారా దేశవ్యాప్తంగా 65 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యాలు అందుతున్నాయని చెప్పారు. ఈ పథకంతోపాటు ప్రధాని మోదీ చేపట్టిన యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ విధానంపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, రంగాల మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఆమె గర్భిణీల సౌకర్యార్థం ‘ఎర్లీ మార్నింగ్‌ యాంటీనాటల్‌ క్లినిక్‌’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 58 మంది వైద్య విద్యార్థులకు డిగ్రీలు, ముగ్గురికి బంగారు పతకాలు అందజేశారు.

నైతికతతో విధులు నిర్వహించాలి

వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో ఉంటారని, జీవిత-మరణాల మధ్య నిలబడి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలుగా సేవలందిస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ కొనియాడారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రపంచం ఇళ్లకే పరిమితమైనప్పుడు, వైద్యులు ప్రమాదాలను ఎదుర్కొంటూ రోగుల ప్రాణాలను రక్షించారని గుర్తుచేశారు. ఏఐ వైద్యుల నైపుణ్యానికి సహాయకరంగా ఉపయోగపడుతుందని, అయితే వైద్యుడి చేతి స్పర్శలోని సానుభూతి, స్వస్థత శక్తికి సాటిలేదని ఆయన అన్నారు. లాభాపేక్షతో మందులు సూచించడం వంటివి చేయకూడదని, నైతికతను మరవకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమంలో మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యక్షుడు తపన్‌కుమార్‌ సాహా, ఈడీ అహెంతమ్‌ శాంతాసింగ్, రీసెర్చ్‌ డీన్‌ జాయ్‌ ఘోష్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story