Commonwealth Games: గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రులు అభినందనలు తెలిపారు.

సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందిస్తూ, అజయ్ బాబు తన తండ్రి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ క్రీడా వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించారని కొనియాడారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ భారతదేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ క్రీడా కీర్తిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

మంత్రి నారా లోకేశ్ కూడా అభినందిస్తూ, “తండ్రికి తగ్గ తనయుడు. అజయ్ యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచాడు. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాం” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు కూడా అజయ్ బాబును అభినందించారు. కామన్వెల్త్ రికార్డుతో పాటు రజత పతకం సాధించడం అజయ్ ప్రతిభకు నిదర్శనమని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని, క్రీడాకారులను ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

శాప్ ఛైర్మన్ రవి నాయుడు అజయ్ బాబు చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచారని, దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

Updated On
Next Story