CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి అభ్యర్థులు తప్పనిసరిగా గెలవాలని స్పష్టం చేశారు.
సోషల్ రీ-ఇంజినీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని సీఎం చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే 11 మేయర్ స్థానాలను 11 సామాజిక వర్గాలకు కేటాయించామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కూటమి నేతలు మిత్రధర్మం పాటిస్తూ కలుపుకొని వెళ్లాలని సూచించారు.
2024 ఎన్నికల ఫలితాలకు మించిన స్థాయిలో ఓట్ల శాతం పెరగాలని ఆయన ఆదేశించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవాల్సిందేనని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఫలితాలు సాధించాలని కోరారు.
ప్రజాభిప్రాయం, కేడర్ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక చేపట్టామని సీఎం పేర్కొన్నారు. పలు చోట్ల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైకాపా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గొడ్డలి పార్టీ చర్యలను గమనిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఆ పార్టీ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో కూటమి నాయకులు పాల్గొని ఎన్నికల వ్యూహంపై చర్చించారు. నామినేషన్ల దాఖలు సమయంలో కూటమి నేతలు తమ అభ్యర్థులతో కలిసి వెళ్లాలని సీఎం సూచించారు.

