Speaker Ayyanna Patrudu: అమరావతి అసెంబ్లీ భవనం.. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Speaker Ayyanna Patrudu: అమరావతిలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ భవనాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయం లోపు పూర్తి చేయాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు.
సచివాలయం రెండో బ్లాక్‌లో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు, ఇంజినీర్లు, అలాగే ఐకానిక్ భవనాల నమూనాలను రూపొందించిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ఆర్కిటెక్చర్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.
అసెంబ్లీ భవనం అంతర్గత ఆకృతులు (ఇంటీరియర్ డిజైన్లు), సభ్యులకు సీటింగ్ ఏర్పాట్లు, డిజిటల్ సాంకేతిక వసతులు, ఎత్తైన టవర్, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు, భద్రత, పార్కింగ్, సందర్శకులకు సౌకర్యాలు వంటి అంశాలపై సమావేశంలో వివరంగా చర్చించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా 265 మంది ఎమ్మెల్యేలకు, 110 మంది ఎమ్మెల్సీలకు సరిపోయేలా శాసనసభ, శాసనమండలితో కూడిన అసెంబ్లీ భవనాన్ని డిజైన్ చేశామని ఆయన వెల్లడించారు. ఉభయ సభల సభ్యులు కలిసి కూర్చునేందుకు సెంట్రల్ హాల్ ఉంటుందని, మంత్రులు, విప్‌లు, కమిటీల ఛైర్మన్లు, సభ్యులకు అవసరమైన సదుపాయాలు కల్పించేలా భవనాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.
అత్యాధునిక సాంకేతికత, సమర్థ కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు, పచ్చదనంతో అసెంబ్లీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు సందర్శించినప్పుడు శాసన ప్రక్రియపై అవగాహన కలిగేలా ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అండర్‌గ్రౌండ్ పార్కింగ్ పైభాగంలో గార్డెన్ తరహా ప్రాంగణం అభివృద్ధి చేయాలన్నది సీఎం ఆలోచన అని వివరించారు.



