Amaravati: అమరావతికి శాశ్వత చట్టపరమైన హామీ: రాజ్యసభలో ఆమోదం
రాజ్యసభలో ఆమోదం

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పించే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చర్చ ప్రారంభించిన ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడారు. బిల్లుపై చర్చ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
రాజ్యసభలో బిల్లు ఆమోదం అయిన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. బిల్లుపై చర్చలో మొత్తం 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు పాల్గొనగా, 10 పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు.
ఈ బిల్లు ఆమోదంతో అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టపరమైన హోదా పొందుతుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మైలురాయి అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా సులభంగా ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆనందదాయకం

