ఐకానిక్‌ కేబుల్‌ వంతెన డిజైన్‌ ఖరారు

Amaravati: రాజధాని అమరావతిని అనుసంధానించే ఐకానిక్‌ కేబుల్‌ వంతెన నిర్మాణం కోసం డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో నాలుగు నమూనాలను ప్రదర్శించి ఓటింగ్‌ నిర్వహించగా, రెండో ఆప్షన్‌కు 14 వేలకు పైగా ఓట్లు రాగా, సీఎం కూడా దీనినే ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లతో టెండర్లు త్వరలో పిలవనున్నారు. డీపీఆర్‌ సిద్ధమైన ఈ వంతెన అమరావతిలోని ఎన్‌13 రోడ్డును ఎన్‌హెచ్‌65 (విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి)తో అనుసంధానిస్తుంది.

కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమను పోలిన ఈ వంతెన డిజైన్‌ ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో స్థానికతను ప్రతిబింబిస్తుంది. నిప్పన్‌ కోయి లిమిటెడ్‌ డీపీఆర్‌ను రూపొందించగా, ఆరు వరుసలు, రెండు వైపులా కాలిబాటలతో 5.22 కి.మీ. పొడవున రాయపూడి నుంచి ఎన్‌టీఆర్‌ జిల్లా మూలపాడు వరకు నిర్మాణం జరుగనుంది. 2019లో తెదేపా ప్రభుత్వం రూ.1,387 కోట్లతో ఎన్‌10 నుంచి పవిత్ర సంగమం వరకు వంతెన శంకుస్థాపన చేసినప్పటికీ, వైకాపా ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం స్థలాన్ని మార్చి, పశ్చిమ బైపాస్‌తో అనుసంధానించింది.

ఈ వంతెనతో హైదరాబాద్‌-అమరావతి మధ్య 35 కి.మీ. దూరం తగ్గనుంది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌65 నుంచి అమరావతికి 40 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉండగా, ఈ వంతెనతో మూలపాడు నుంచి 5 కి.మీ.లోనే అమరావతి చేరుకోవచ్చు. దీనివల్ల గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ, హైదరాబాద్‌ మార్గాలకు సులభంగా మారేందుకు ఎన్‌హెచ్‌65 వద్ద ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story