భవిష్యత్ పరిశోధనల కేంద్రంగా మారనుంది - సీఎం చంద్రబాబు ఆకాంక్ష

Amaravati Quantum Valley: ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వేలాది మంది టెక్నాలజీ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన 'క్వాంటమ్ టాక్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్యూబిట్, వైసర్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

క్వాంటమ్ కంప్యూటింగ్ రంగం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చంద్రబాబు వివరించారు. గతంలో చైనా 1970లో, భారత్ 1991లో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి అభివృద్ధి బాట పట్టినట్లు, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా కొత్త యుగం ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. హరిత విప్లవం ద్వారా భారత్ ఆహార ధాన్యాల్లో స్వయంసమృద్ధి సాధించినట్లు, ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సామాన్యుల సాధికారతకు సంస్కరణలు అమలవుతున్నాయని ప్రశంసించిన చంద్రబాబు, విశాఖపట్నం ఐటీ హబ్‌గా, భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారబోతోందని చెప్పారు. అలాగే తిరుపతిని స్పేస్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో క్వాంటమ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాష్ట్రం ప్రపంచ స్థాయి పరిశోధనలకు చిరునామాగా మారనుందన్న ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story