రాజధాని నిర్మాణం కొనసాగుతుంది: సీఎం చంద్రబాబు నాయుడు

N. Chandrababu Naidu: ‘‘అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా?’’ అని ప్రశ్నిస్తూ, ‘‘మీలాంటి వెయ్యి మంది వచ్చినా అమరావతి ఆగదు. నాయకుడే కాదు.. ఆ పార్టీ మొత్తం అలాగే అనిపిస్తోంది’’ అని వైకాపా అధినేత వై.ఎస్. జగన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో గురువారం నిర్వహించిన ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు అందజేశారు. అమరావతి రాజధాని అభివృద్ధిపై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటు స్పందన ఇచ్చారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘అమరావతికి ఒక్క పిలుపుతోనే 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారు. ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావు గారు ‘అమరావతి’ అని నామకరణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి పురుడుపోసుకుంది. అలాంటి అమరావతి అభివృద్ధిని గత పాలకులు కక్షపెట్టి విధ్వంసం చేశారు. రైతుల త్యాగాలకు విలువ ఇవ్వకుండా చేశారు’’ అని గుర్తు చేశారు.

అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవాలయం వరకు పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుని వేధించారని, హైకోర్టు, సుప్రీం కోర్టు అమరావతికి మద్దతు ఇచ్చాయని చెప్పారు. ఇప్పుడు పార్లమెంటు కూడా అమరావతిని రాజధానిగా గుర్తించి చట్టం చేసిందని సీఎం తెలిపారు.

జగన్ ఇటీవల చేసిన ‘‘మూడు ముక్కలాట’’, ‘‘మావిగన్’’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘‘మొన్న మూడు ముక్కలాట అన్నారు.. నిన్న మావిగన్ అన్నారు.. ఇంకా నయం, వాటికన్ అనలేదు’’ అని ఎద్దేవా చేశారు. వైకాపా బ్యాచ్ అరాచకాలు, బెదిరింపులు పెరుగుతున్నాయని, అధికారంలో ఉండగా విధ్వంసం చేసి, ప్రతిపక్షంలో బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.

అమరావతి అభివృద్ధి కోసం ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ చేపట్టామని, రైతుల భూ హక్కులను కాపాడటంతో పాటు పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పట్టాదారు పాస్‌బుక్కులు అందిస్తామని చెప్పారు.

ఈ సభలో సీఎం చంద్రబాబు రైతుల సమస్యలు విని, ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల ఆనందమే ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story