Minister Nara Lokesh: వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని మంత్రి అన్నారు. 2024 నాటికి రాష్ట్ర అక్షరాస్యత 72.6 శాతంగా దేశంలో అట్టడుగు స్థాయిలో ఉండగా, కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఒక్క ఏడాదిలోనే 25 లక్షల మంది వయోజనులు అక్షరాస్యులయ్యారు. దీనికి కేంద్రం అభినందించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. 2027 సెప్టెంబర్‌ నాటికి 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా అందరూ కృషి చేయాలని సూచించారు.

బడిబయట ఉన్న 1,64,821 మంది పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని, విద్యార్థుల హాజరును ప్రస్తుతం ఉన్న 85.41 శాతం నుంచి పెంచాలని ఆదేశించారు. ఏఐ సమర్థ్‌ ఇనిషియేటివ్‌ ద్వారా ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై రాజీ పడకూడదని, రాష్ట్రవ్యాప్తంగా 125 ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. క్లస్టర్‌ కాంప్లెక్స్‌ సమావేశాల నిర్వహణను మంత్రి అభినందించారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5న విజయవాడలో 192 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మంత్రికి తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతానికి పెరిగిందని, బడిబయట ఉన్న పిల్లల్లో 33 వేల మందిని ఇప్పటికే పాఠశాలల్లో చేర్పించామని వెల్లడించారు. అక్షరాంధ్ర కార్యక్రమం కింద వచ్చే ఏడాది మార్చి నాటికి 25 లక్షలు, సెప్టెంబర్‌ నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఇంటర్మీడియట్‌లో 10 వేల ప్రవేశాలు పెరిగాయని పేర్కొన్నారు.

Next Story