Andhra Pradesh Cabinet Meeting: భీమునిపట్నంలో రూ.31,387 కోట్లతో గ్రీన్ ఏఐ డేటా సెంటర్ – మంత్రిమండలి ఆమోదం
మంత్రిమండలి ఆమోదం

Andhra Pradesh Cabinet Meeting: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనం గ్రామంలో రూ.31,387 కోట్ల పెట్టుబడితో 512 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. దీని ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి దక్కనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులను వేగంగా గ్రౌండ్ చేసేలా కూడా సూచనలు ఇచ్చారు.
ఇతర ముఖ్య నిర్ణయాలు:
తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం. దీనితో 700 మందికి ఉపాధి లభిస్తుంది. కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ఇక్కడ ఐరన్ ఫాస్ఫేట్, లిథియం ఐరన్ ఫాస్పేట్, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారు చేయనుంది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ల కోసం క్రిటికల్ మాడ్యులర్ భాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం. రూ.570.20 కోట్ల పెట్టుబడితో 2,565 మందికి ఉపాధి కల్పించనున్నారు.
మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ కోసం 24.96 ఎకరాల భూమి కేటాయింపు.
అనకాపల్లి జిల్లాలోని బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటిరో గ్రూప్‌కు 173.82 ఎకరాలు కేటాయింపు.
అలాగే ఆంధ్రప్రదేశ్ యానిమేషన్, రోబోటిక్స్, సెమీకండక్టర్ పాలసీల ముసాయిదా సవరణలకు కూడా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో పాత థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సాంకేతికతతో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు.ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించనున్నాయి.

