Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే- ఎంపీలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ఎంపీలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ అంశంలో సంబంధిత కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏమి సాధించవచ్చో నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు, పథకాలు సాధించాలని ఆదేశించారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలి. అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్వోదయ పథకంలోకి తీసుకొని వేగంగా పూర్తి చేయాలి. పోలవరం, నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకొని పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించి కూటమి ఐక్యతను కాపాడాలని సూచించారు.
ఆదివారం ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన ముఖ్య అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఎంపీలకు సూచనలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్, విభజన హామీల అమలు, విద్య, వైద్యం, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరిగింది.
రాబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు జనసేన, భాజపా ఎంపీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. ‘‘తెదేపా ఎప్పుడు పొత్తులో ఉన్నా కూటమి ఐక్యతను కాపాడుతుంది. కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించకూడదు. దృష్టి కేంద్ర పథకాలపై ఉండాలి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
రైల్వేలు, ఎన్‌హెచ్‌ల నిర్మాణం వేగవంతం చేయాలి
రాష్ట్రంలో దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వీటిని మరింత వేగంగా పూర్తి చేసేలా ఎంపీలు చొరవ చూపాలని సీఎం సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్వోదయ పథకంలో పెట్టించి పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.12 వేల కోట్లు అవసరమని, గోదావరి పుష్కరాలలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. నల్లమల సాగర్ వంటి అంశాలపై రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని ఆదేశించారు.
పొరుగు రాష్ట్రాలతో నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు అవసరం లేదని, లౌక్యంగా వ్యవహరించాలని సూచించారు. ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలు వర్చువల్‌గా పాల్గొనాలని తెలిపారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు లేన్ల రైల్వే ట్రాక్ నిర్మాణం, ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు పెద్ద ఎత్తున చేపట్టాలని రైల్వే శాఖ సిద్ధంగా ఉందని, నియోజకవర్గాల అవసరాలు గుర్తించి నిధులు సాధించాలని ఆదేశించారు.
పార్టీ కార్యాలయానికి విధిగా రావాలి: లోకేశ్
ప్రతి ఎంపీ పార్టీ కోసం సమయం కేటాయించి, విధిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. జాతీయ స్థాయిలో ఎన్‌డీయే కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానాలివ్వాలని ఆయన తెలిపారు.
సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, బైరెడ్డి శబరి విలేకరులకు తెలిపారు.

