Andhra Pradesh High Court: హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం

Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌లు ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ సోమవారం మొదటి కోర్టు హాలులో వారితో ప్రమాణం చేయించారు.
అంతకుముందు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి అదనపు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త న్యాయమూర్తులు తమ ధర్మాసనాలను చేపట్టారు. జస్టిస్ సునీత జస్టిస్ బట్టు దేవానంద్‌తో, జస్టిస్ ఆలపాటి గిరిధర్ జస్టిస్ డి. రమేశ్‌తో, జస్టిస్ పురుషోత్తం కుమార్ జస్టిస్ రవినాథ్ తిల్హరితో కలిసి కేసుల విచారణ ప్రారంభించారు.
ఏపీ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 29 మంది సేవలందిస్తున్నారు. ఈ ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకంతో మొత్తం సంఖ్య 32కి పెరిగింది.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు పాల్గొన్నారు. కొత్త న్యాయమూర్తులను అనేక మంది న్యాయవాదులు, శ్రేయోభిలాషులు అభినందించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ నియామకాలు హైకోర్టు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.

