Regional Investment Summits: ఏపీలో మూడు ప్రాంతీయ పెట్టుబడి సదస్సులు.. రూ.79,628 కోట్ల ప్రతిపాదనలు
రూ.79,628 కోట్ల ప్రతిపాదనలు

Regional Investment Summits: విశాఖపట్టణంలో నవంబరులో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా అక్టోబరు 7న విశాఖపట్నంలో, 12న కాకినాడలో రెండు సదస్సులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి.
మిగిలిన మూడు ప్రాంతీయ సదస్సులను అక్టోబరు 16న అమరావతిలో, 23న అనంతపురంలో, 26న తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ మూడు సదస్సుల్లో మొత్తం 115 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకునే అవకాశం ఉందని, రాష్ట్రానికి రూ.79,628.04 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులు రానున్నాయని పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా సుమారు 1,80,038 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పరిపాలన, రాజధాని అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాలు, క్వాంటం వ్యాలీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏరోస్పేస్-డిఫెన్స్, ఆటోమోటివ్, సహజ వ్యవసాయం, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, టూరిజం, ఆతిథ్యరంగం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, సెమీకండక్టర్లు, ఆధునిక మెటీరియల్స్, స్పేస్, పాదరక్షల రంగాల్లో పెట్టుబడులు రాబోతున్నాయి.
ఇప్పటికే ముగిసిన రెండు ప్రాంతీయ సదస్సుల్లో 46 అవగాహన ఒప్పందాలు నమోదయ్యాయి. వాటి వివరాలు, తదుపరి సదస్సుల్లో ఒప్పందాలు చేసుకోబోయే కంపెనీల తాత్కాలిక జాబితా, పెట్టుబడుల వివరాలు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.

