CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెట్టుబడులు రూ.1.14 లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందువల్ల సుమారు 67 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఐటీ, పర్యాటక, ఏరోస్పేస్, ఆహార ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఒప్పందాలు జరిగిన సంస్థల నుంచి వచ్చిన సవరణ ప్రతిపాదనలను కూడా ఎస్‌ఐపీబీ పరిశీలించి ఆమోదించింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని సాధించిన ఐటీ మంత్రి లోకేశ్‌ను సీఎం, మంత్రులు ప్రశంసించారు.
ఎస్‌ఐపీబీ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్, అనగాని సత్యప్రసాద్, దుర్గేష్, బీసీ జనార్దన్‌రెడ్డి, వాసంశెట్టి సుభాష్, అధికారులు.
రైడెన్ నుంచి అతిపెద్ద విదేశీ పెట్టుబడి
దేశ చరిత్రలోనే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ రూ.87,520 కోట్లతో డేటా సెంటర్ స్థాపనకు ప్రతిపాదన సమర్పించింది. ఈ డేటా సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి కొత్త మైలురాయి అవుతుందని ఎస్‌ఐపీబీ అభిప్రాయపడింది. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో అనుసంధానంగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ మూడు క్యాంపస్‌లను నిర్మించనుంది. ఇంతటి స్థాయి విదేశీ పెట్టుబడి గతంలో ఎప్పుడూ రాలేదని ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ‘ఇప్పటివరకు జరిగిన 11 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇచ్చాం. ఇవి ఏర్పాటు చేసే పరిశ్రమల ద్వారా 6.20 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గత 15 నెలలుగా చేస్తున్న పెట్టుబడుల ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేందుకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేయాలి. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తే ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతుంది. రైడెన్, గూగుల్ వంటి సంస్థల స్థాపనతో విశాఖ ఏఐ సిటీగా మారనుంది’ అని అన్నారు.
